తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మూడు లోపు, బీఆర్ఎస్కు నాలుగైదు సీట్లు వస్తాయని కాంగ్రెస్కు పది ప్లస్ వస్తాయని సీఓటర్ సంస్థ వెల్లడించింది. అయితే బీఆర్ఎస్, బీజేపీకి కలిసి పోటీ చేస్తే పధ్నాలుగు సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారని సీఓటర్ సంస్థ చీఫ్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. అయన ఇలాంటి సలహా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఓ ప్రణాళిక ప్రకారం బీజేపీతో కలవాలని బీఆర్ఎస్కు సంకేతాలు పంపుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
లోక్ సభ ఎన్నికల విషయంలో బీజేపీ చిన్న నిర్లక్ష్యానికి కూడా చాన్సివ్వడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి పట్టుతో ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంది. అయితే మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. అధికార పార్టీ అడ్వాంటే.. కొత్త మోజు అన్నీ కలిసి కాంగ్రెస్ కు లాభిస్తుంది. అందుకే.. బీఆర్ఎస్, బీజేపీ కలయికపై చర్చ ప్రారంభమయింది. ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. గతంలో అయోధ్య రామమందిరంపై కూడా విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.
పార్టీని కాపాడుకోవాలంటే… బీజేపీకి సన్నిహితం కాక తప్పదన్న భావన కేసీఆర్ గతంలోనే వ్యక్తం చేశారు. తర్వాత మనసు మార్చుకున్నారు. మళ్లీ మారారు. ఇలాంటి సైకిల్ లో ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ నుంచి ప్రతిపాదన వస్తే.. ఖచ్చితంగా పొత్తు పెట్టుకోక తప్పదు. అదే జరిగితే ఆ కూటమికి తాత్కలిక లాభం వస్తుందేమో కానీ.. బీఆర్ఎస్ మాత్రం.. పూర్తిగా నిర్వీర్యమైపోతుందన్న ఆందోళన ఎక్కువ మందిలో ఉంది. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో ?