అవును..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆ పార్టీ క్యాడర్ లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరద సహాయక చర్యలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చినా నలుగురైదుగురు నేతలు మినహా ఎవరూ పట్టించుకోలేదు. కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన సన్నిహిత నేతలు కూడా పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.
ఖమ్మం జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , నల్గొండ జిల్లాలో బొల్లం మల్లయ్య యాదవ్ , వరంగల్ జిల్లాలో సత్యవతి రాథోడ్, గ్రేటర్ లో లక్ష్మారెడ్డి మాత్రమే వరద సహాయక చర్యలో పాల్గొన్నారు. ఆ విపత్కాల సమయంలో కేటీఆర్ విదేశాల నుంచి పిలుపునిచ్చినా కీలక నేతలు, కార్యకర్తలు మొహం చాటేయడానికి కారణం ఏంటన్న చర్చ జరుగుతోంది.
వరదలతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సలహాలు, సూచనలు చేయాల్సిన కేసీఆర్ మిన్నకుండిపోవడం పట్ల బీఆర్ఎస్ లో అసహనం వ్యక్తం అవుతోంది.
అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అవకాశాలు వస్తున్నా… అందిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ చూపడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగకుండా కేవలం కేటీఆర్ పిలుపుతో క్యాడర్ రంగంలోకి దిగే అవకాశం లేదని అంటున్నాయి పార్టీ వర్గాలు.