బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే అసలు తెలంగాణనే ఉండదన్నట్లుగా ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిదీ అదే వరుస.
కేటీఆర్ .. తెలంగాణలో బీఆర్ఎస్ ను గెలిపించకపోతే హైదరాబాద్ ను యూటీ చేస్తారని.. తమనకు పన్నెండు సీట్లు ఇస్తే.. యూటీ కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు. రాజకీయంగా అవసరమైనప్పుడల్లా హైదరాబాద్ యూటీ అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెస్తారు. తెలంగాణ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్ ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు.కానీ వర్కవుట్ అవలేదు.
కేసీఆర్ మరో ప్రచార సభలో గోదావరిని మోదీ ఎత్కపోతరంట అని ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. గోదావరిని ఎత్కపోవడం ఏమిటో కానీ.. ఆయన తాను సీఎంగా లేకపోతే గుక్కెడు మంచినీళ్లు కూడా తాగడానికి ఉండవని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ప్రచార వ్యూహం అంతే ఉంది. తెలంగాణ ఇంతకు ముందు లేనట్లుగా.. తాము లేకపోతే తెలంగణ లేదన్నట్లుగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వర్కవుట్ అవుతుందో కానీ .. పదేళ్ల పరిపాలన తర్వాత నాలుగు నెలల్లోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే.. పదేళ్లలో ఏమీ చేయలేదనే కదా అర్థం అని ఇతర పార్టీల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.