మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి యాభై లోక్ సభ సీట్లు గెలిచి… వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పుతామని ఉబలాటపడిన బీఆర్ఎస్ కు ఇప్పుడు .. మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండటం లేదు. గతంలో తెలంగాణ రాజకీయాల కన్నా మహారాష్ట్ర రాజకీయాలపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టేవారు. ప్రత్యేకంగా చేరికల కోసం ఓ షెడ్యూల్ రూపొందించారు ఆ ప్రకారం నేతలంతా వచ్చి చేరుతూ వచ్చారు. బహిరంగసభలు పెట్టారు. నాగపూర్ లో పార్టీ ఆఫీస్ పెట్టారు. మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి యాభై సీట్లు గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు.. పార్టీలో చేరిన కొంత మంది లోకల్ పోల్స్ లో గెలిచారని చెప్పుకున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ కోసం మహారాష్ట్ర నుంచి ఒక్కరూ రావడం లేదు. చేరికల గురించి ఎలాంటి ప్రచారం లేదు. బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్ర వైపు పోవడం లేదు. చివరికి కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. 2024 వచ్చేసింది. మామూలుగా అయితే మార్చి పదో తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఈ సారి ఇరవై రోజుల ముందే ఇస్తారన్నప్రచారం జరుగుతూండటంతో.. ఫిబ్రవరిలోనే ఇస్తారు. అంటే ఇంకా గట్టిగా నలభై రోజులు కూడా లేదు. ఇప్పుడున్న ప్రణాళికల ప్రకారం చూస్తే.. కేసీఆర్ మహారాష్ట్రను కూడా వదిలేసినట్లే అనుకోవచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ పూర్తిగా నిరాశలో ఉన్నారు. అదే సమయంలో కిందపడటంతో తుంటి గాయం అయింది. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టినా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఉన్న సీట్లను గెలిపించుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ముందు తెలంగాణలో పరువు నిలుపుకోకపోతే.. పార్టీ నిర్వీర్యం అయిపోతుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన చెందుతోంది.