ఫేస్ బుక్ ఒక్క నిమిషం చూస్తే బీఆర్ఎస్ యాడ్స్ నాలుగు కనిపిస్తాయి. ట్విట్టర్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక యూట్యూబ్ లో ఏ వీడియో ఆన్ చేసినా మొదట బీఆర్ఎస్ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఇక వెబ్ సైట్ల విషయానికి వస్తే… తెలుగుకు సంబంధించి ఏది ఓపెన్ చేసినా.. అది బీఆర్ఎస్ వెబ్ సైట్ ఏమో అని అనుమానం కలిగేలా .. బీఆర్ఎస్ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా డిజిటల్ మీడియాలో గులాబీ ప్రకటనల హోరు కనిపిస్తోంది. ఇదంతా ఆఫీషియల్ గా డబ్బులు కట్టి చేసుకోవాల్సిన ప్రచారం.
ఇక అనఫిషియల్ గా .. ఇన్ఫ్లూయన్సర్స్తో చేస్తున్న ప్రచారం అయితే హద్దులు దాటిపోయింది. కొన్ని వందల మంది గులాబీ జెండలే రామక్క అంటూ డాన్సులేస్తున్నారు. నాడు ఎట్లున్నది.. నేడు ఎట్లున్నది అని వీడియోలు వేస్తున్నారు. కాస్త ఫాలోయర్లు ఉన్న ఏ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ ను వదిలి పెట్టకుండా వాడేస్తున్నారు. వీరికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడం కష్టం. కానీ బీఆర్ఎస్ ఖర్చుకు వెనుకాడటం లేదు. అసలు అలాంటి ఆలోచనలే పెట్టుకోవడం లేదు.
అధికారంలో ఉన్న పార్టీకి తమ పాలనా విజయాలే ప్రచారం. అంతే కానీ.. ఇష్టం వచ్చినట్లుగా ఇలా ఏదో చేశామని ప్రచారం చేసుకుంటే వెగటు పుట్టే అవకాశం ఉంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా బీఆర్ఎస్ డిజిటల్ ప్రచారం.. పరిధులు దాటిపోతోందన్న అభిప్రాయం మాత్రం నెటిజన్లలో ఎక్కువగా వినిపిస్తోంది. గొప్పగా చేశామని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ తాపత్రయ పడుతోంది. కానీ ఇలా చేయడం వల్ల వాటిని చూస్తున్న వారికి సమస్యలు గుర్తుకు వస్తాయి.