హైడ్రా దూకుడుపై ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ కిందా మీదా పడుతోంది. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో బీఆర్ఎస్ సమర్థించలేదు..కానీ తాము వ్యతిరేకమని సంకేతాలివ్వడానికి ప్రయత్నించింది. నేరుగా వ్యతిరేకిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. కాంగ్రెస్ నేతలకు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ లు ఉన్నాయని వాటిని కూలగొట్టగలరా అని చాలెంజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. కానీ అదంతా వారికే రివర్స్ అవుతోంది.
వారు చెప్పే ఫామ్ హౌస్‌లు ఉన్న పెద్దల్లో నిన్నామొన్నటి వరకూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానంత వరకూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. పొంగులేటి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. వారి ఫామ్ హౌస్‌లు అక్రమం అయితే.. ఎందుకు పదేళ్ల పాటు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న రివర్స్‌లో బీఆర్ఎస్కు వస్తోంది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. తాను కట్టిన పామ్ హౌస్ .. ఫుల్ ట్యాంక్ లెవల్ లేదో.బఫర్ జోన్ లో ఉన్నట్లయితే.. ఎవరో కూల్చాల్సిన పనిలేదని తానే కూల్చేస్తానని పొంగులేటి చెబుతున్నారు. మిగతా వారు కూడా అదే చెబుతారు.
ఆరోపణలు చేయడం కాకుండా.. ఆధారాలతో సహా ఫలానా రాజకీయ నాయకుడి భవనం చెరువు ను కబ్జా చేసిందో.. ఫుల్ ట్యాంక్ లెవల్లో కట్టారనో హైడ్రాకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకపోతే అప్పుడు స్పందించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తీరు ఎలా ఉందంటే.. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లన్నీ అక్రమమే అన్నట్లుగా ఉంది. గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్, కాలేజీని కూడా అలాగే చెబుతున్నారు. బీఆర్ఎస్ తాపత్రయాన్ని చూసి… హైడ్రాను నిలువరించేందుకు ఇంత కష్టపడుతున్నారేమిటని సెటైర్లు పడుతున్నాయి.