లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం లేదన్నది ఓపెన్ సీక్రెట్. ఈ ఎన్నికల్లో ఎలాంటి నినాదం లేకపోవడం బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది. ఇదే ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది జూన్ వరకే హైదరాబాద్ ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండనుందని.. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారనుందని బిగ్ బాంబ్ పేల్చారు. కేటీఆర్ కు ఈ విషయంపై ఖచ్చితమైన సమాచారం ఉందో లేక రాజకీయ ప్రకటనో తెలియదు కానీ, ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
నిజానికి హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే వాదనలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల ముంగిట కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ -కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఎలాంటి నినాదం లేకపోవడంతో ఈ అంశాన్ని ముందుంచి సెంటిమెంట్ తో రాజకీయం చేయాలనుకొని ఈ ప్రకటన చేసి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో జెండా ఎగరేయాలని భావిస్తోన్న బీజేపీ ఈ అవకాశంతో హైదరాబాద్ ను తమ గుప్పిట్లోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తోన్న బీజేపీ..సౌత్ లో తిరుగులేని శక్తిగా అవతరించేందుకు రేపు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ స్టేట్ మెంట్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ ను జనాలు విశ్వసించే పరిస్థితి లేదని కౌంటర్ ఇస్తున్నారు.