ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితిని నడిపించే నేతలు ఖరారయ్యారు. జనసేన నేత , మాజీ ఐఏఎస్ అధికారి, వివాదాస్పద రియల్ ఎస్టేట్ వ్యాపారి తోట చంద్రశేఖర్ ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా నియమితులు కానున్నారు . ఆయన సోమవారం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు రావెల కిషోర్.. పార్థసారధి అనే మరో ఐఆర్ఎస్ ఆఫీసర్ కూడా బీఆర్ఎస్లో చేరనున్నారు.
తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి. ముంబైలోని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో ఆయన పేరు వినిపించింది. అంతకు ముందు నుంచే ఆయన తన కుమారులతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పేరుతో ఆయన భారీ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. ఆయన వ్యాపారం చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. తోట చంద్రశేఖర్ మొదట పీఆర్పీతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. మళ్లీ జనసేనలోకి వచ్చారు. రెండు సార్లు ఎంపీగా, ఓ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దక్కలేదు.
గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఏపీలో తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్లో చేరడానికి ఎవరూ లేరని.. ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేత అయినా దొరుకుతారా అన్న చర్చ జరుగుతూండగా… ప్రధాన పార్టీల తరపున పోటీ చేసినా ఎప్పుడూ గెలుపు ముఖం చూడని నేత బీఆర్ఎస్కు ఆప్షన్ గా లభించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
రావెల కిషోర్ బాబు మరో వివాదాస్పద నేత . పిలిచి టిక్కెట్ ఇచ్చి.. మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ ఆయనను పక్కన పెట్టింది. జనసేన, బీజేపీల్లో చేరి బయటకు వచ్చారు. ఇటీవల టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు.. బీఆర్ఎస్లో చేరుతున్నారు. పార్థసారధి కూడా గతంలో పీఆర్పీ తరపున ఎంపీగా పోటీ చేశారు. మొత్తంగా మాజీ నేతలకు బీఆర్ఎస్లో మంచి స్థానాలు దక్కే చాన్సులు కనిపిస్తున్నాయి.