తెలంగాణలో బీఆర్ఎస్ వరదతో బురద రాజకీయం చేస్తోంది. వరద బాధితులను ఆదుకోవడంలో సర్కార్ ఫెయిల్ అయిందంటూ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్.. ఇప్పుడు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రమంత్రులతో డిప్యూటీ సీఎం ప్రయాణించడంపై చిలువలు పలువలు చేసేలా రాజకీయం చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది.
ఇటీవల వరదలకు ఉమ్మడి ఖమ్మం , వరంగల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చాలా కుటుంబాలు ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులుగా మారాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం చోటు చేసుకుంది. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు వచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అయితే, దేన్ని రాజకీయం చేయాలో ముందు వెనక ఆలోచించకుండా బీఆర్ఎస్ నేతలు ఈ ఏరియల్ సర్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్రమంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రయాణించడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ముగ్గుగు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్ – బీజేపీ ఒకటే అనేందుకు ఈ చిత్రమే నిదర్శనమని ప్రచారం ప్రారంభించారు. భారీ వర్షాలతో తెలంగాణలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రమంత్రి వస్తే.. ఇక్కడి పరిస్థితులు వివరించేందుకు భట్టి విక్రమార్క వారితో ప్రయాణించారని కాంగ్రెస్ వాదిస్తోంది.
అయినా.. భట్టి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నేత.. ఆ ప్రాంత ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు కేంద్రమంత్రులతో కలిసి ప్రయాణిస్తే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన నొప్పెంటి అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. కేంద్రం నుంచి సహాయం పొంది ప్రజలకు మేలు చేసే ఉద్దేశాన్నికి కూడా రాజకీయాలు అంటకడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.