ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని ..ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా ఎమ్మెల్యేల వలసలకు బ్రేకులు పడుతాయని బీఆర్ఎస్ హైకమాండ్ నమ్మడం లేదు. ఈమేరకు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ బాస్ ఏం చేయాలన్న దానిపై కొద్ది రోజులుగా సమాలోచనలు జరుపుతున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి..త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో ఎమ్మెల్యేల చేరికల ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసే అవకాశం ఉంది. ఆగస్ట్ 14న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు రానున్నారు. ఆ తర్వాత ఈ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభం అవుతుందని గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది.
Also Read : అక్కడ వైసీపీ.. ఇక్కడ బీఆర్ఎస్.. తీరు మారదా?
కాంగ్రెస్ పవర్ లో ఉండటం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అందుకే నేతలు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంత బుజ్జగించినా మెత్తబడటం లేదు. రేవంత్ రాష్ట్రానికి వచ్చాక ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ చేస్తే.. బీఆర్ఎస్ మరింత బలహీనం అవుతుంది అని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఈ సమయంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురు అవుతుంది. అదే జరిగితే పార్టీ పునాదులు కదులుతాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయినా ఎమ్మెల్యేలను చేజారకుండా కాపాడుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ .. ఎమ్మెల్యేలతో వారం రోజులపాటు ఫారిన్ ట్రిప్ కు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
అక్కడే రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయాన్ని వెలువరిస్తారని అంటున్నారు. అయినా ఈ ఫారిన్ ట్రిప్ కు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు? ఎంతమంది డుమ్మా కొడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.