తెలంగాణలో కొత్త వాతావరణం కనపడుతోంది. గతంలో అంశాల వారీగా, సమస్యల వారీగా రాజకీయం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక రాష్ట్రంలో అయినా కనీసం కుల రాజకీయాలు కూడా తెలంగాణలో ఉండకపోయేవి. కుల రాజకీయాలు చేయాలని చూసి ఫెయిల్ అయిన నాయకుల్లో చివరకు కేసీఆర్ కూడా ఒకరు.
అలాంటి తెలంగాణలో ఇప్పుడు కొత్తగా దేవుళ్ల పేరుతో రాజకీయం మొదలుపెట్టారు. నేను ఫలానా దేవుడి సాక్షిగా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ముఖ్యమైన దేవుడి పేరు చెప్పారు.
ఇప్పుడు సరిగ్గా రుణమాఫీ కాలేదు… దేవుడి కోపం వస్తుంది… రేవంత్ రెడ్డి పాపం చేసిండు కానీ ఆ పాపం తెలంగాణ ప్రజలకు వద్దూ అంటూ హరీష్ రావు బయల్దేరిండు. రేవంత్ రెడ్డి ఏ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగారో, ఆ దేవుడి దగ్గరకు పోయి క్షమించమని ప్రార్థిస్తారని బీఆర్ఎస్ అంటోంది. ఆయన పేరే చెప్పారు… మేం ఇప్పుడు ఏకంగా తీర్థయాత్రలే చేస్తామని ప్రకటిస్తోంది.
అంటే… ఎటొచ్చి ఇప్పుడు దేవుడి పేరు, గుడితోనే రాజకీయం చేస్తున్నారు. ఇందులో ఇంకా బీజేపీ వెనుకపడి పోయింది. నిజానికి ఇలాంటి వాటిలో బీజేపీ ఓ అడుగు ముందుంటుంది. కానీ, నడిపించే నాయకుడు సరిగ్గా లేకపోతే గమ్యం తెలియకు ఆగమాగం అయితది అన్నట్లు తయారైంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. అందుకే ఈ గుడి రాజకీయంలో ఎక్కడా జాడ లేదు.
హరీష్ రావు తీర్థయాత్రల రాజకీయానికి కాంగ్రెస్ ఎలాంటి విరుగుడు కనిపెడుతుందో చూడాలి.