బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు కరెంటే పోలేదని ఇప్పుడు కరెంటే ఉండటం లేదననట్లుగా బీఆర్ఎస్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి రాజకీయవర్గాలకూ మైండ్ బ్లాంక్ అవుతోంది. తెలంగాణలో కరెంట్ కోతల్లేవు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ సమ్మర్ లో అధిక వినియోగం వల్ల వచ్చే నిర్వహణ సమస్యలతో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడా నాలుగైదు నిమిషాలు కరెంట్ పోతోంది. దాన్నే చిలువలు పలువులుగా చేసి రాజకీయం చేసి కాంగ్రెస్ హయాంలో అసలు కరెంటే లేదన్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోషల్ మీడియా ఖాతాల్ని ప్రారంభించిన కేసీఆర్ అందులో విచిత్రాలు జరుగుతున్నాయంటూ… మహబూబ్ నగర్లో రెండు సార్లు కరెంట్ పోయిందని ట్వీట్ చేశారు. అక్కడ స్విచ్లు ఏమైనా ఆఫ్ చేసుకున్నారేమో కానీ… ఆ ఏరియాలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని ఆ విషయాన్ని డిజిటల్ మీటర్ రికార్డు చేసిందని విద్యుత్ అధికారులు ప్రకటించారు. దీంతో కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తాను మాత్రమే ఎక్కడ్నుంచో కరెంట్ తెస్తానని రేవంత్ కు చేతకాదన్నట్లుగా కేసీఆర్.. బీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఈ కరెంట్ రాజకీయం ఎంత వర్కవుట్ అవుతుందో కానీ.. కేసీఆర్, బీఆర్ఎస్ పై మాత్రం పదవి లేకపోతే ఉండలేకపోతున్నారన్న ఓ రకమైన అభిప్రాయం ఏర్పడుతోంది. లేని సమస్యల్ని ఉన్నట్లు చూపడం కోసం.. సోషల్ మీడియా సైన్యాన్ని వాడేసుకుంటున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మళ్లీ తప్పు చేయవద్దని ప్రజల్ని నిందిస్తున్నారు. వీరి రాజకీయానికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది.