భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విశ్వరూపం చూపిస్తోంది. అధికారం అందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన విభాగాన్ని అంతే బలంగా నిర్మించుకోవడంలో విఫలమైన ఫలితంగా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని వేగంగా ఇబ్బంది పెట్టగలుగుతోంది. ఓ వైపు పార్టీ ఉంటుందో.. బీజేపీలో విలీనం అవుతుందో తెలియని స్థితిలో గందరగోళంగా ఉండాల్సిన బీఆర్ఎస్ క్యాడర్… కాంగ్రెస్ పార్టీపై రకరకాల ఆరోపణలు చేస్తూ.. వారు తప్పనిసరిగా స్పందించేలా చేస్తోంది.
అమెరికా పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పాయిలర్ గేమ్ ఆడింది. స్వచ్చ బయో అనే ఓ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని హైలెట్ చేసి.. మిగతా ఒప్పందాలన్నీ ఫేక్ అని నమ్మించేందుకు చేయని ప్రయత్నమే లేదు. నిజానికి కేటీఆర్ చేసుకున్న ఒప్పందాల్లో ఇలాంటి స్వచ్చ బయో కంపెనీలు లెక్కలేనన్ని ఉంటాయి. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆలస్యంగా వాటి గురించి ప్రచారం ప్రారంభించారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. దాంతో జయేష్ రంజన్ స్వయంగా వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.
పార్టీల సోషల్ మీడియాలకు బాధ్యతల్లేవు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచడానికి ఎలాంటి వార్త ఉపయోగపడుతుందో.. అలాంటి దాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయడమే పని. ప్రభుత్వం సీరియస్ అయి కేసులు పెడితే అదో అడ్వాంటేజ్ కానీ.. మైనస్‌గా భావించడం లేదు. పలితంగా ప్రభుత్వంపై ఎటాక్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బలం సరిపోవడం లేదు. సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి.. కేటీఆర్ ఓడపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా బలహీనపడకుండా చూసుకుంటున్నారు.
రాజకీయాల్లో నిజమా.. ఫేకా అన్నదానికి ఇప్పుడు విలువలేదు. ఎంత మంది ప్రజల్ని నమ్మించగలమన్నదే కీలకం. ప్రభుత్వంపై అపోహలు.. వ్యతిరేకత పెంచగలిగితే ఎలాంటి అవకాశాన్ని అయినా వదలరు. గత ఐదు నెలల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసిందో లెక్కే లేదు. కానీ కాంగ్రెస్ జాగ్రత్త పడలేకపోయింది.