అన్ని రకాలుగా అనుభవించి, పార్టీకి ద్రోహం చేసి, మోసం చేసి పోయిన నేతల్ని ఓడించి తీరాలని బీఆర్ఎస్ కంకరణం కట్టుకుంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లను ఓడించి తీరుతామని ముఖ్య నేతలు పంతం పట్టారు. తాము గెలవకపోయినా పర్వాలేదు వారు మాత్రం ఓడాలన్న స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
నమ్మించి మోసం చేసిన వారికి బుద్ది చెప్పాలన్నదే తమ టార్గెట్ అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కడియం పార్టీ మార్పు బీఆర్ఎస్ పెద్దల్ని ఎక్కున బాధపెట్టింది. కడియం కోసం కీలక నేతల్ని వదులుకున్నారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య కడియం వల్లే పార్టీకిదూరమయ్యారు. అందర్నీ వదులుకుని కడియంకు.. ఆయన కుమార్తెకు ప్రాధాన్యం ఇస్తే కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న కోపం బీఆర్ఎస్ హైకమాండ్ లో కనిపిస్తోంది.
రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్‌రెడ్డికి టిక్కెటిచ్చి, చేవెళ్ల ఎంపీని చేస్తే ఆయన కూడా ఇప్పుడు మోసం చేశారు. దానం నాగేందర్ వ్యవహారంపైనా బీఆర్ఎస్ ముఖ్యులు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కేసీఆర్ ప్రగతి భవన్‌ను వీడిన తర్వాత, ఆయన ఎక్కడుండాలనే చర్చ జరిగినప్పుడు…’నాకు జూబ్లీహిల్స్‌లో పెద్ద ఇల్లు ఉంది, మీరు నా తండ్రి లాంటి వారు, మీరు నా ఇంట్లో ఉండొచ్చు…’ అంటూ ప్రకటించిన దానం… ఇప్పుడు పార్టీ మారిపోయారు వీరందర్నీ ఓడించడమే టార్గెట్‌గా బీఆర్ఎస్ పెట్టుకుంది.