రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అవతరణ ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో బీఆర్ఎస్కు చోటు లేదు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా ఇంత కాలం చేసిన రాజకీయాలు తేలిపోయే పరిస్థితి ఏర్పడటంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. తమ ఆధ్వర్యంలో స్వయంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
నిజానికి పదేళ్లు కాకపోయినా గత ఏడాది జూన్ రెండో తేదీనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. భారీ ఖర్చుతో నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రజలు అంత చురుకుగా పాల్గొనలేదు కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం పండగ చేసుకున్నారు. ఏడాదంతా నిర్వహిస్తామని. మళ్లీ అధికారంలోకి వచ్చాక ముగింపు ఉత్సవాలు ఓ రేంజ్ లో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు గెలవలేదు కానీ తెలంగాణ క్రెడిట్ కోసమైనా… సొంతంగా ముగింపు సంబరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే .దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు మూడురోజుల పాటు నిర్వహించాలని నిర్ణియంచారు. జూన్ ఒకటిన గన్ పార్క్ నుండి క్యాండిల్ ర్యాలీ , జూన్ రెండవ తేదీన కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం, దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో పళ్లు, స్వీట్ల పంపిణీ, మూడో తేదీన పార్టీ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్ని ఎంగేజ్ చేయడం కష్టం కాబట్టి… వారితో సభలు, సమావేశాలు జోలికి వెళ్లకుండా పార్టీ నేతలతోనే ఈ వేడుకలు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.