ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపునే రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో వేయాలని పోలింగ్ తేదీలు దగ్గరకు వచ్చినప్పుడు కాదని రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పట్టుకుని బీఆర్ఎస్ నేతలు ఒక్క సారిగా విరుచుకుపడటం ప్రారంభించారు. రైతు బంధు ను ఆపేయమని.. కాంగ్రెస్ నేతుల ఫిర్యాదులు చేశారని.. రైతులందరూ కలిసి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆరోపణలు చేశారు.
ఎన్నికల కోడ్‌పై బీార్ఎస్ ఎంత హడావుడి చేస్తే..అంత అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ ఎన్నో పథకాలను ప్రారంభించి ఇలా కోడ్ రాగానే అలా ఆపేసి..ఇతర పార్టీలపై విమర్శలు చేసేవారు. చివరికి గ్రేటర్ ఎన్నికల్లో వరద బాధితులకు కొంత సాయం చేసి.. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మొత్తం ఆపేసి.. బీజేపీ వల్లనే ఆపేశామని విమర్శలు గుప్పించారు. దళిత బంధు విషయంలోనూ అంతే. ఎన్నికలు అయిన తర్వాత అయినా వాటిని ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ నేతల ఓవర్ రియాక్షన్ చూస్తూంటే… పథకానికి డబ్బులు ఇచ్చే ఉద్దేశంలో లేరన్న అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఖజానాలో డబ్బుల్లేవని.. రైతు బంధు ఇవ్వాలంటే.. ఆరేడు వేల కోట్లు కావాలని.. ఎన్నిక కోడ్ పేరుతో పథకాన్ని ఆపేసి కాంగ్రెస్ మీదకు తోసేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు.
నగదు బదిలీ పథకాలన్నింటినీ… నవంబర్ రెండో తేదీ లోపునే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఏదైనా సరే.. రైతు బంధు .. ఆపితే అది బీఆర్ఎస్కే మైనస్ అయ్యేలా ఉంది. వాళ్లు ఆపారని.. వీళ్లు ఆపారని సాకులు చెబితే రైతులు నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే.. అధికారంలో ఉంది బీఆర్ఎస్సే మరి.