పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. గత రెండు, మూడు పార్లమెంట్ సెషన్స్‌లో టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వపై విరుచుకుపడింది. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేలా నినాదాలు చేసేవారు. ఈ సారి కేంద్రంపై ఎలా పోరాడాలన్నదానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు ఇతర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇతర పార్టీల్లో కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు.
ఇప్పటి వరకూ పార్లమెంట్ రికార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా గుర్తించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ .. బీఆర్ఎస్గా మారిన తొలి సమావేశాలుగా వీటిని భావించవచ్చు. జాతీయ పార్టీగా మారినందున.. కేంద్రంపై పోరాటంలో తమదైన మార్క్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇతర పార్టీలను కలుపుకుని వాటికి నాయకత్వం వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఆయా పార్టీలను కేసీఆర్ బీఆర్ఎస్ వెంట పార్లమెంట్ లో కూడ నడిపించేలా చేస్తే.. ఆయన జాతీయ నాయకుడిగా గర్తింపు పొందడం ప్రారంభమవుతుంది.
కొంతకాలంగా గవర్నర్, సీఎంకు మధ్య పడటం లేదు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ పై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఘర్షణ పూరిత వాతావరణంలో ఢిల్లీలో బీఆర్ఎస్ పోరాట అజెండాపై … ఆ పార్టీ నేతల్లోనూ ఆసక్తి ఏర్పడింది. ఆదివారం కేసీఆర్ ఎంపీలకు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.