రోటీ మేకర్, రోడ్డు రోలర్ గుర్తులపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. ఆ గుర్తుల్ని వచ్చే ఎన్నికల్లో ఎనరికీ ఇవ్వొద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు , రిజిస్టర్ అయిన పార్టీల అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ మేకర్, ట్రక్కు, ఆటో, ట్రాక్టర్ లాంటి గుర్తుల్ని కేటాయిస్తున్నారు. ఇవన్నీ కారుని పోలి ఉండటం వల్ల తమ పార్టీకి పడే ఓట్లు డైవర్ట్ అవుతున్నాయని బీఆర్ఎస్ వాదన.
ఈ విషయాన్ని గతంలోనూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేటాయించారు. ఈ సారి మత్రం కే్టాయించవద్దని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. 2020 నవంబర్ లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక లో బీఆర్ఎస్ అభ్యర్థి 1,079 ఓట్లతో ఓడిపోయింది. కానీ రోటీ మేకర్ గుర్తుతో పోటీచేసిన బండారు నాగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి 3,510 ఓట్లు పోల్ అయ్యాయి. రోటీ మేకర్ కారు గుర్తును పోలినట్లుగా ఉండటంతో అవన్నీ బీఆర్ఎస్ ఓట్లేనని ఆ పార్టీ నేతలు భావించారు. పలు ఎన్నికల్లో ఈ గుర్తులకు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి.
బరిలో నిలబడింది డమ్మీ క్యాండిడేట్ అయినా అదే పరిస్థితి. దృష్టి దోషం ఉన్న ఓటర్లలో ఈ గుర్తు గందరగోళం సృష్టిస్తున్నదని, కారుకు పడాల్సిన ఓట్లు వీటి వెళ్ళిపోతున్నాయని టీఆర్ఎస్ అంటోంది. ఇంతకాలం కొన్ని స్థానాలకే ఈ తలనొప్పి ఉంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకూ ముప్పుగా పరిణమిస్తుందన్నది ఆ పార్టీ ఆవేదన. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కీలకం కానుండడంతో ఇతర పార్టీలకు చెందిన వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి.. ఉద్దేశపూర్వకంగా రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులను కోరుకుంటారని.. అదే జరిగితే ఓట్లు చీలుతాయని అనుకుంటున్నారు. ఈసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. లేకపోతే కోర్టుకైనా వెళ్లాలని అనుకుంటున్నారు.