కూల్చివేతలపై ఎలా స్పందించాలో తెలియక గందరగోళంగా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. ఓ వైపు తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు రేవంత్ పై ఆ పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటున్నారు. కానీ ఏదీ జరగడం లేదు.. రివర్స్ లో ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ప్రజాస్పందన పాజిటివ్ గా ఉందని తేలడంతో కూల్చివేతల్ని వ్యతిరేకిస్తే కబ్జాదారులకు అండగా ఉన్నట్లేనన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటికి అలాంటి పరిస్థితి వచ్చింది.
కూల్చివేతల్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. నిజానికి చెరువుల్లో కబ్జాలు చేయగలిగేది రాజకీయ నేతలే. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసింది అదేనని వారిని కాపాడేందుకు ఆ పార్టీ రంగంలోకి దిగిందని అంటున్నారు. డబ్బు అధికారం ఉన్న నేతలే కబ్జా లు చేస్తారు కానీ.. సామాన్యులు కాదు. ఈ విషయంలో వేరే అభిప్రాయాలు ఉండవు. ఇప్పుడు కూల్చివేతలు కూడా బడా బాబులవే కాబట్టి ప్రజల్లో సానుకూలత వస్తోంది.
కూల్చివేతల్ని వ్యతిరేకించి రాజకీయం చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది . అలాగని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను సమర్థించలేరు. అందుకే రాజకీయంగా నష్టం జరిగినా కూల్చివేతల్ని వ్యతిరేకించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోది. పేదలు, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా కూల్చివేతల విషయంలో ఓ స్టాండ్ తీసుకోలేకపోతోంది బీఆర్ఎస్.