దగ్గుబాటి పురంధేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎంతమాత్రం సరిపడదనే విషయం రాజకీయ వర్గాలకు బాగా తెలుసు. ఇద్దరూ పరస్పర వ్యతిరేక పార్టీలలో ఉన్నప్పుడు ఎటూ తిట్టుకోవడమే గనుక ఏ గొడవ ఉండేది కాదు. కానీ ఆమె టిడిపి భాగస్వామ్య పక్షమైన బిజెపిలో చేరి జాతీయ మహిళా విభాగానికి నాయకురాలైన తర్వాత చిక్కొచ్చిపడింది.
ఎప్పుడు, ఏ అవకాశం దొరికినా చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు ఆమె సిద్ధమైపోతారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో వైసీపీ ఫిరాయింపుదారులను చేర్చుకోవడం ఆమెకు అందివచ్చిన అవకాశం అయింది. అంతేగాక పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఇది సరైంది కాదన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కడం మరింతగా కలిసి వచ్చింది. గట్టి చట్టం లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వెంకయ్య అనగానే చట్టం తీసుకురమ్మని ఆమె కేంద్రానికి లేఖ రాయడం గురించి నిన్న చెప్పుకున్నాము. ఇది కేవలం ప్రచారం కోసం రాసిన లేఖ కాగా, దాన్ని వైసీపీ, టీడీపీ తమ తమ పద్ధతుల్లో వాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తమ వాదనను ఆమె బలపరిచిందని వైసీపీ వాదన. కేంద్రంలో అంతకాలం నుండి గట్టి చట్టంగా మార్చేందుకు పురంధేశ్వరి ఎందుకు ప్రయత్నించలేదని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వంటివారు ఎదురు లేఖలు బనాయించారు. పైగా ఆమె వైసీపీలో చేరబోతున్నారని కూడా ఆరోపించారు. నిజానికి అలా చేరే ఆలోచన లేదని గతంలోనే తేలిపోయింది. అయినా తమనుతాము సమర్థించుకోవడానికి పురంధేశ్వరిపై సంప్రదాయిక కక్ష తీర్చుకోవడానికి తెలుగుదేశం గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఆమె కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి చేరారని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. అలా అయితే చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంవైపునకు వచ్చినవాళ్లే. ఇక్కడ సమస్య ఫిరాయింపుదారులను ఎలా కట్టడి చేయాలన్నది తప్ప గత చరిత్రను తవ్వుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం.
నెమ్మదిగా దీన్ని నందమూరి వంశంలో చర్చగా మార్చి పురంధేశ్వరిని మరింత గట్టిగా ఖండింపచేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. వాస్తవానికి బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు విష్ణు కుమార్ రాజు కూడా ఇదే రీతిలో తప్పుబట్టారు. ఆయనను వదిలి, ఈమెపై మాత్రమే దాడి కేంద్రీకరించడంలో గత కక్షలు తొంగిచూస్తున్నాయి. ఈ వివాదం వల్ల మొత్తం చర్చ జగన్ చుట్టూ తిరగకుండా దారి మళ్లించటానికీ వీలు కలుగుతుంది.