ప్రభుత్వం అంటే కొన్ని పద్దతులు ఉంటాయి. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అనేక నిబంధనలు ఉంటాయి. వాటికి తగ్గట్లుగా పరిపాలన చేయడమే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ విధి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నింటికీ అతీతంగా వ్యవహరిస్తోంది. అడ్డగోలుగా పరిపాలన చేస్తూ… అయితే తప్పేంటి ? అని వాదించడం అందర్నీ నివ్వెర పరిచేలా చేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పులు జరిగితే… అయితే ఎంటి ? అని ప్రశ్నించడం వారి విశృంఖలత్వానికి పరాకాష్టగా కనిపిస్తోంది.
ఉద్యోగులంటే అంత ఎటకారమా ? ఎవరి కోసం జీతాలిస్తారు ?
మూడు, నాలుగు రోజులు ఆలస్యంగా అయినా జీతాలిస్తున్నాంగా ఎగ్గొట్టడం లేదుగా అనేది ఆయన చేసిన ఎటకారం. నెలంతా కష్టపడి ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉండటం దౌర్భాగ్యం. దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు బుగ్గన. అంతే కాదు.. ఇస్తున్నాం కదా .. ఎగ్గొట్టడం లేదు కదా అని ఆయన వెటకారం. ఉద్యోగులంటే ఎంత అలుసుంటే ఆర్థిక మంత్రి అలా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక గవర్నర్ను తాకట్టు పెట్టిన అంశంపైనా అదే పెడరస సమాధానం. అయితే ఏంటి ? అని. అన్ని కార్యక్రమాలు గవర్నర్ పేరు మీదనే జరుగుతాయని చెప్పుకొచ్చారు. అన్ని కార్యక్రమాలు జరుగుతాయని అప్పులు కూడా గవర్నర్ను వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేస్తారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. కానీ బుగ్గన దాన్ని కూడా అడ్డగోలుగా అయితే తప్పేంటి అని సమర్థించుకుంటున్నారు.
చేయాల్సినవన్నీ చేసి తప్పేంటి ? అని వాదిస్తే కరెక్ట్ అవుతాయా?
జీతాలు, గవర్నర్ పేరుపై అప్పు విషయంలోనే కాదు… నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న అప్పులు.. రహస్య ఒప్పందాలపైనా అదే వాదన. ప్రపంచం అంతా అప్పులు చేస్తోందని తాము అప్పులు చేస్తున్నామని చెప్పుకోవడానికి ఆయన ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఎవరు అప్పులు చేసినా వారి సామర్థ్యానికి తగ్గట్లుగానే అప్పులు చేస్తారు. తిరిగి చెల్లించలేని స్థితికి రాష్ట్రాన్ని నెట్టేసే దుర్భరమైన పరిస్థితి తీసుకు రారు. ఇప్పుడు బుగ్గన అదే చేశారు. కానీ దానికి కూడా తప్పేంటి అని అంటున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్ తరాలకే దెబ్బ. ప్రజలకే నష్టం.,
గతి తప్పిన అప్పుల పుట్ట పగలబోతోందని బుగ్గన బయట పెట్టేశారు !
త్వరలో ఏపీ ప్రభుత్వం అప్పుల వ్యవహారంలో చేసిన అతి భారీ స్కాం బయటపడబోతోందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్యాపదేశంగా చెప్పారు. అదేమిటంటే చట్టబుద్దంగా అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేయాలి. అది నాలుగుశాతం మాత్రమే. కానీ ఏపీ ప్రభుత్వం ఏకంగా పదకొండు శాతానికి మించి అప్పులు చేసింది. ఈ విషయాన్ని బుగ్గన చెప్పారు.ఈ విషయంపై త్వరలో కేంద్రం నిలదీస్తుందని సమాధానం చెబుతామని బుగ్గన అంటున్నారు. ఆయన మాటలతో ఏం చేసినా తప్పేమిటన్న ఎదురుదాడి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్న వ్యూహం బయటకు తెలుస్తూనే ఉంది.