కశ్మీర్ సమస్య అయినా.. అయోధ్య వివాదం అయినా.. చిటికెలో పరిష్కారం చూపగల నేత… తమ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌కు పంచసిద్దులున్నాయంటున్నారు. పంచ సిద్దులు అంటే.. యాగాల ద్వారా .. కేసీఆర్‌కు సంక్రమించిన ప్రత్యేకేమైన శక్తులు కాదు. అవి ఐదు లక్షణాలు. ఆ పంచ సిద్దులు ఏమిటేమిటంటే… ఫేస్‌వాల్యూ, వాక్చాతుర్యం , శరీర ఆకృతి, గుండె ధైర్యం, ఔదార్యం అని.. టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు. ఈ లక్షణాల కారణంగా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య, కశ్మీర్ సమస్యలకు కేసీఆర్ పరిష్కారం చూపుతారని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వల్లనే.. కశ్మీర్ సమస్య ఇంకా ఉందని… కేసీఆర్ అయితే.. కశ్మీర్, అయోధ్య సమస్యలకు పరిష్కారం చూపించగలిగేవారని అంటున్నారు. తెలంగాణ, కశ్మీర్ సమస్య ఒక్కటేనని, అయితే సర్దార్ వల్లభాయ్‌పటేల్ చొరవతో చేపట్టిన ఆపరేషన్ పోలోతో తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదన్నారు. ఆ పటేల్ తరహాలోనే దేశంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌వంటి నాయకత్వ లక్షణాలున్న నేత కావాలని టీఆర్ఎస్ ఎంపీ విశ్లేషించారు. అయోధ్యలో ఎవరైతే గొడవపడుతున్నారో.. వారందర్నీ ఒకే చోట కూర్చోబెట్టి.. ఆలయానికి శంకుస్థాపన చేయించగల సమర్థుడు కేసీఆర్ అని.. ఎంపీ పొగుడుతున్నారు. కేసీఆర్‌ను దేశ్ కీ నేతగా.. ప్రజెంట్ చేయడానికి.. టీఆర్ఎస్ నేతలు ముందస్తుగానే ప్రకటనలు చేస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ అనే కూటమిని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో కేవలం వైసీపీ మాత్రమే ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల తర్వాత.. తమ వద్ద ఉండే.. ఎంపీల బలంతోనే… “దేశ్ కి నేత”గా కేసీఆర్ అవతరిస్తారని… టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే.. దేశంలో పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలైన.. కశ్మీర్, అయోధ్య వంటి వాటిని పరిష్కరిస్తారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో కేసీఆర్ కు ఉన్న పంచ సిద్దులు.. కేంద్రంలో అధికారాన్ని తెచ్చి పెడతాయో..లేదో వేచి చూడాలి..!