పాలకుల్లో అసహనం రోజు రోజుకూ పెరిగిపోతోన్న వైనానికి సోషల్ మీడియా పోస్టులపై చూపుతున్న అణిచివేత ధోరణి ఓ తార్కాణం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను దాటుకుని సోషల్ మీడియా ముందుకు దూసుకుపోతుండడంతో, దీన్నెలా అదుపులోకి తెచ్చుకోవాలో మన నేతలకు ఏమాత్రం అర్ధం కావడం లేదు. దాంతో సామ,దాన, దండోపాయాల్లో చివరిదే ఎంచుకుని హిట్లర్ తరహా పాలనను గుర్తుకు తెస్తున్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో గతంలో చంద్రబాబు ముందంజలో ఉండగా, ఇప్పుడు కెసియార్ ఈ విషయంలో తాను సైతం విమర్శకు ఓర్వలేని వ్యక్తినే అంటూ నిరూపించుకున్నారు.
నిజామాబాద్‌కు చెందిన టిఎస్ఆర్టీసీ కండక్టర్ సస్పెన్షన్ ఉదంతం పాలకులను విమర్శిస్తే చిరుద్యోగి అని కూడా చూడకుండా పొట్ట కొట్టేందుకు తెగబడతారనే విషయాన్ని నిరూపిస్తోంది. ఇంతకీ ఈ చిరుద్యోగి సస్పెండ్ అవడానికి కారణం ఏమిటంటే… ఆర్టీసీ పరిస్థితి, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టడమే. గత కొంత కాలంగా తమ చేత రోజుకు 16గంటల చొప్పున పని చేయిస్తూ, నాలుగేళ్లుగా కొత్త యూనిఫాం సైతం ఇవ్వకుండా టిఎస్ఆర్టీసీ అవలంబిస్తున్న విధానాలు సంస్థ పురోగతికి ఏ మాత్రం మేలు చేయడం లేదంటూ కండక్టర్ సంజీవ్ విమర్శించాడు. తెలంగాణ వచ్చాక అద్దె బస్సుల సంఖ్య పెరిగిందని గుర్తు చేశాడు. టిఎస్ఆర్టీసీకి రూ.250కోట్లు జిహెచ్ఎమ్సి నుంచి ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఒక్కపైసా కూడా అందలేదన్నాడు. ఈ మధ్య కాలంలో దాదాపు 2500 ఖాళీలు ఏర్పడినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎత్తి చూపాడు.
కడుపు మండి ఈ విధంగా పోస్ట్‌లు పెట్టడమే ఈ చిరుద్యోగి చేసిన నేరమైంది. అతడిని ఆర్టీసీ సస్పెండ్ చేసేసింది. దీంతో ఆయన నిజామాబాద్ బస్‌డిపో ఎదుట బుధవారం నుంచి నిరసన చేపట్టాడు. నిజానికి ఈ కండెక్టర్కి కాస్త సామాజిక అవగాహన, పరిస్థితులపై విశ్లేషణ ఉండడంతో ఈ తరహాలో సోసల్ మీడియాలో స్పందిస్తున్నాడు. గతంలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలప్పుడు కూడా నోటుకు ఓటును అమ్ముకోవద్దని, గత నాలుగేళ్లుగా మనకి ఒరిగిందేమిటో చూసి ఓటేయాలంటూ పిలుపిచ్చాడు.
ఏదేమైతేనేం… ఇవన్నీ ప్రభువుల వారికి ఆగ్రహం తెప్పించి, ఇతని ఉద్యోగంపై జులుం చేసేందుకు దారి తీశాయి. అయితే దీన్ని తాను వదలబోనని న్యాయ పోరాటానికి అయినా సిద్ధమంటున్నాడు సంజీవ్.
నాయకులనైనా, మరెవరినైనా వ్యక్తిగతంగా హేళన చేయడం, కుటుంబసభ్యుల్ని ఎద్దేవా చేయడం, అశ్లీల పదజాలంతో తిట్టడం వంటివి సోషల్ మీడియాలో ఎంత మాత్రం అనుమతించకూడదనేది నిస్సందేహం. అలాంటి పోస్టులు పెట్టేవారిపై గట్టి చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. అయితే ప్రభుత్వాల విధానాలను నిశితంగా విమర్శించినంత మాత్రానే ఇలా ఆగ్రహిస్తే ఇక భావ ప్రకటనా స్వేఛ్చకు అర్ధం ఏముంటుంది?