ఆన్ లైన్ విద్యను వ్యాపారంగా చేసుకుని లక్షల కోట్లకు పడగలెత్తే ప్రయత్నంలో జారి కిందపడిన బైజూస్ .. లేవడానికి చేస్తున్న ప్రయత్నాలు దివాలా దిశగా సాగుతున్నాయి. ఇటీవలే సీఈవో గుడ్ బై చెప్పారు. కొత్త సీఈవో రాగానే… పనుల్లేవని చెప్పి సగం మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిచేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే గత ఏడాదిన్నరగా… బైజూస్ వేల మందిని తీసేస్తూ పోతోంది. కొంత మంది ఉద్యోగులు ఏడుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న వారిలో అరవై శాతం మందిని సాగనంపుతున్నారు.
బైజూస్ డబ్బులు మరిగిన తర్వాత పూర్తిగా పట్టు కోల్పోయింది. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా… క్వాలిటి కంటెంట్ లేదు. టీచర్లను నియమిచుకున్నా సభ్యులు తగ్గిపోయారు. రెన్యూవల్స్ దాదాపుగా లేవు. ఆకాష్ సంస్థను టేకోవర్ చేశారు. అన్నీ కలిపి క్క సారిగా మీదపడ్డాయి. కరోనా సమయంలో ఎక్కువ మంది ఆన్ లైన్ కు మారడంతో పంట పండింది.. దాంతో మిలియన్ల కొద్దీ రుణాలు తీసుకుని దుబారా చేశారు.
ఇప్పటికే బెంగళూరులో ఆఫీసుల్ని ఖాళీ చేసి అద్దెలు మిగుల్చుకుంటున్నారు. రుణ చెల్లింపులుకు బైజూస్‌కు పెనుభారంగా మారాయి. చెల్లించకుండా అమెరికా కోర్టుల్లో వేసిన పిటిషన్లతో పరువుపోయింది. మరో 6 నెలల్లో రుణాలు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం చాలా ఎక్కువగా ఉంది. వచ్చే మూడు నెలల్లో 300 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లిస్తామని రుణదాతలకు బైజూస్ ప్రతిపాదన చేసింది. రుణాల చెల్లింపులో విఫలం అయితే ఆకాష్ సంస్థ కూడా చేజారిపోతుంది. అదే జరిగితే బైజూస్ రవీంద్రన్ సర్వం కోల్పోయినట్లయింది.