తెలంగాణ మంత్రివర్గలో మార్పు చేర్పులు చేస్తారని ఏడాదిన్నర కిందటి నుంచి చర్చ జరుగుతోంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుండి ఆ పార్టీ నేతలు ఇదే అంశంపై ఆశలు పెట్టుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీల భర్తీ విషయంలో కొత్త కేబినెట్ సమీకరణాలే చూసుకున్నారన్న చర్చ కూడా జరిగింది. రాజ్యసభ సభ్యునిగా ఉండ బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేశారు. కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి రాత్రికి రాత్రి పదవీ విరమణ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. చాన్స్ లేదనుకున్న కడియం శ్రీహరికీ అవకాశం కల్పించారు. కేబినెట్ సమీకరణాలతోనే వీరికి అవకాశం కల్పించారని టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.
కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారని అప్పట్నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారని.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో ఆరుగురు రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఉన్నారు. బడ్జెట్ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్.. మంత్రి వర్గాన్ని సంక్రాంతిలోపే సంస్కరించే అవకాశం ఉంది.
పరిస్థితులు బాలేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని.. అదే జరిగితే.. మంత్రివర్గ విస్తరణ చేసే అంశంపై ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే ఆ పనిచేస్తారని కేసీఆర్ సెంటిమెంట్లు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేసుకుని సిద్ధం కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.