ఏపీ ప్రజలు ఆర్థిక రిస్క్‌లో పడిపోతున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. ఈ భారం అంతా వారిపైనే పడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల జమాఖర్చుల వివరాలు.. కాగ్ ఇచ్చిన వాటిని చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కాగ్ రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ఆరు నెలల్లోనే 49వేల కోట్లకుపైగా అప్పు చేశారు. బడ్జెట్లో ఏడాది మొత్తం చేస్తామని వేసిన అంచనా రూ. 48 వేల కోట్లే. ఈ అప్పుల అంచనా సాధారణంగా చాలా ఎక్కువ. అయినప్పటికీ ఆరు నెలల్లోనే అంతకంటే ఎక్కువే అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం.
సెప్టెంబర్ వరకూ రూ. 49263 కోట్లను అప్పు తెచ్చినట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రహస్య అప్పులు తీసుకున్నారని కాగ్‌కు లెక్కలు చెప్పని అప్పులు మరో ఐదారు వేల కోట్లు ఉంటాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ అప్పుల గురించి లేకపోయినా… ఆరు నెలల్లో.. ఏడాది మొత్తం చేయాల్సిన అప్పు చేసేశారు. ఇదే ధోరణి కొనసాగిస్తే.. ఏడాదికి లక్ష కోట్లఅప్పు అవుతుంది. అంటే సంపాదన ఎంతో… అప్పూ అంతే. లోటు కూడా ఏడాది మొత్తం మీద 27 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆరు నెలలకే ఆ లోటు దాదాపుగా రూ. 41వేల కోట్లకు చేరిపోయింది. ఆర్థిక సంవత్సరం చివరికి లక్ష కోట్లకు చేరినా ఆశ్చ్రయం లేదు.
ఆగస్టు వరకు తేల్చిన లెక్కల మేరకు ఏకంగా రూ.62,568 కోట్లు బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేశారు. ఇదంతా అప్పులు తీర్చేందుకే. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు చేసే వ్యయం కూడా భారీగానే ఉన్నట్లు తేలింది. ఆగస్టులో కూడా బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయారు. రూ.37 వేల కోట్లకుపైగా నిధులు ఆగస్టు వరకు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు జరగలేదని కాగ్ పేర్కొంది. ఈ పరిస్థితి చూసి ఆర్థిక నిపుణులకు కూడా పిచ్చెక్కిపోతోంది. ప్రజాధనం పట్ల.. రాష్ట్రం పట్ల.. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటున్నారు.