మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి. అసలు పార్టీలతో కాకుండా నకిలీ పార్టీలో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తూండటంతో ఉన్న సీట్లకూ గండి పడే ప్రమాదం ఏర్పడిందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. గతంలో శివసేనతో కలిసి క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ చేసిన ప్రయోగాలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అసలు పార్టీలను చీల్చి నకిలీ పార్టీల ఏర్పాటును ప్రోత్సహించి… వాటినే అసలైన పార్టీలుగా ఎన్నికలకు వెళ్తున్నారు.
శివసేన పార్టీని చీల్చడంలో బీజేపీది కీలక పాత్ర. షిండే బలం మొత్తం బీజేపీనే. శివసేన గుర్తు కూడా లాగేసుకున్నారు. నిజమైన శివసేనను షిందే చేతికి ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. కానీ థాకరేలు లేని శివసేన ఉంటుందా ?. అక్కడి ప్రజలు ఊహించగలరా అంటే.. సాధ్యం కాదని సర్వేలు చెబుతున్నాయి. ఉద్దవ్ ధాకరే చేతిలోని శివసేననే ప్రజలు అసలైనదిగా గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శరద్ పవార్ పార్టీ ఆయనది కాదని .. వేరే వారికి అప్పగించారు. కానీ అసలైన ఎన్సీపీ శరద్ పవార్ దేనని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అంటున్నారు.
ఈ రాజకీయంలో బీజేపీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఇరవై మూడు సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఈ సారి అలయన్స్ పార్టీల సంగతి పక్కన పెట్టి తాము ఆ స్థానాలైనా దక్కించుకుంటామా లేదా అన్న టెన్షన్ వారిలో ఉంది. బీజేపీకి గడ్డు పరిస్థితి వస్తే.. అక్కడ వెనుకబడిపోతే మొత్తానికి ఢిల్లీ పీఠానికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అదే జరిగితే బీజేపీ వ్యూహకర్తలు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నట్లే.