విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు మరో సారి మీసం మెలేస్తున్నారు. తమ పార్టీ చేసిన పనులే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. ఈయనపై వైసీపీ బెల్లాన చంద్రశేఖర్ ని రంగంలోకి దించింది. కులం కార్డు తప్పించి చంద్రశేఖర్ ఎవరికీ తెలియదు కాబట్టి, తాము రెండో సారి గెలవటానికి ఇదో కారణం అవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీకి అసంతృప్తుల సెగ..!
విజయనగరం అసెంబ్లీ స్థానం తెలుగు దేశం పార్టీకి కంచుకోట లాంటిది. పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ ఆవిర్భావం నుంచి అంతా తానై, అన్నీ తానై నడిపిస్తున్నారు. ఈ దశలో గత ఎన్నికల్లో అశోక్ పార్లమెంట్ వెళ్లినపుడు స్థానికంగా బలమైన కాపు సామాజికవర్గం ఆధారంగా, కుటుంబపరంగా చూసుకొని మీసాల గీత తన రాజకీయ వారసురాలని అప్పట్లో ప్రకటించిన అశోక్, గీత విజయానికి సంపూర్ణ సహకారం అందించారు. ఈ సారి ఎన్నికలకు తన కుమార్తెనే బరిలోకి దించారు. వీరికి ప్రత్యర్ధిగా ఉన్న వైసిపి నేత కోలగట్ల వీరభద్రస్వామికి మాత్రం ఆటుపోట్లు తప్పటం లేదు. బొత్సతో ముందు నుంచి వ్యతిరేక వర్గం నడుపుతున్న కోలగట్లకు ఈ సారి కూడా ఇబ్బందులు తప్పేటట్టు లేదు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోని అధికార టీడీపీలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో అసమ్మతి జ్వాల రేగినప్పటికీ పార్టీ అధినేత కలుగచేసుకోవటంతో అది టీ కప్పులో తుఫానులా చల్లారింది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన పెన్మత్స సాంబశివరాజు ఫ్యాన్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. బొత్స బంధువు అప్పలనాయుడికి చిక్కులు తప్పడం లేదు.
టీడీపీకి కొన్ని సీట్లు ఏకపక్షమే..!
చీపురుపల్లిలో రసవత్తరమైన రాజకీయ పోరు రగులుతోంది. కాకలు తీరిన రాజకీయ చాణుక్యుడు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని పాటిస్తున్నారు. ఏ స్థానంలో అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారో… మరలా అదే స్థానం నుంచి… పూర్వ వైభవం కోసం ఎన్ని చేయాలో అంతకు పదింతలు ఎక్కువే చేస్తున్నారని పబ్లిక్ టాక్. టీడీపీ అభ్యర్ధిగా తొలి సారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున ప్రచారంలో ముందున్నారు. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీకి తొలుత నుంచి విజయాల కోటగా నిలుస్తూ వస్తోంది. కోళ్ల లలితకుమారి తన కొప్పలవెలమ సామాజికవర్గం నియోజకవర్గంలో బలంగా ఉండటం.. సైకిల్ స్పీడుకు తిరుగులేకుండా పోయింది. వైసీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన బడుబండి శ్రీనివాసురావే బరిలో ఉన్నా.. ఇక్కడ ఎన్నిక ఏకపక్షమే అని వినిపిస్తోంది. గజపతినగరం నియోజకవర్గంలో హోరాహోరీ పోరు సాగుతోంది.
పట్టు సడలించని బొబ్బిలి రాజులు..!
బొబ్బిలిలో అయితే ఇక్కడ మంత్రి సుజయ్ క్రిష్ణరంగారావు బొబ్బిలి రాజవంశ వారసునిగా జనంలో ఎక్కువ మార్కులు ఉన్నాయి. మంత్రి సుజయ్ ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ ప్రజలు వారినే గెలిపించటం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈయనపై పోటీగా వైసీపీ కొప్పలవెలమ సామాజిక వర్గానికి చెందిన శంబంగి వెంకట చిన్నప్పలనాయుడుని ఏరికోరి ఎంపిక చేసింది. దీంతో పోటీ రసవత్తరంగా ఉంది. అలాగే గిరిజనుల కోసం కేటాయించిన సాలూరు నియోజవకర్గానికి సంబంధించి రాష్ట్రంలో తొలి స్థానాన్ని టీడీపీ ఆర్.పి.భంజ్ దేవ్ కి ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడు పీడిక రాజన్నదొరను వైసీపీ రెండో సారి రంగంలోకి దించింది. ఎస్.సిల కోసం కేటాయించబడిన పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక శాసనసభ్యులు బొబ్బిలి చిరంజీవులకు రెండో సారి పార్వతీపురం పట్టం కట్టింది. ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్ధి అలజంగి జోగారావుకి అసమ్మతి పోరు గట్టిగా వుంది. ఇదే స్థానం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తు.. చేతి చమురు వదుల్చుకున్న ప్రసన్నకుమార్ వర్గం జోగారావుని ఓడించాలని కంకణం కట్టుకుంది.