కవితకు బెయిల్ లభించడంతో కేసు కొట్టేసినంత ఆనందాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. ఇంత కాలం బయటకు రాలేకపోయిన కేసీఆర్ కూడా రిలాక్స్ ఫీలవుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ గ్రౌండ్ లోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అది సరే.. మరి బీజేపీని ఏమైనా విమర్శించగలరా లేదా అన్నదే పెద్ద సస్పెన్స్ గామారింది.
ఇప్పుడు బీఆర్ఎస్కు ఉనికి సమస్య తెచ్చింది కాంగ్రెస్ కాదు. బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే.. బీజేపీకి ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని మెల్లగా ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ట్రెండ్ కనిపించింది. అత్యధిక సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్.. తన ఓటు బ్యాంకును బీజేపీకి కోల్పోయింది. బీఆర్ఎస్సే పంపించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏం జరిగినా అది బీజేపీ ఖాతాలో పడిపోయింది.
ఇప్పుడు బీజేపీని ఏమీ అనకుండా కాంగ్రెస్ పై మాత్రమే యుద్ధం చేస్తే.. అది బీజేపీకే లాభం కానీ. బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయంగా ఓనమాలు తెలిసిన వారు కూడా చెబుతారు. ముందు తన ఓటు బ్యాంక్, క్యాడర్ ను బీజేపీ వైపు పోకుండా చూసుకోవాలి. అంటే.. బీజేపీపై యుద్ధం ప్రకటించాలి. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని.. బీజేపీ కాదని నిరూపించుకోవాలి. కానీ బీఆర్ఎస్ ఆ టాస్క్ చేయగలిగే ధైర్యం ఉందా లేదా అన్నది అసలు సమస్య.