తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయ పోరాటం చేయాలన్నా.. కష్టమైపోతోంది. వారిలో ఐక్యత లేకపోవడం ఓ కారణం అయితే.. అందరూ ఎలాగోలా సర్దుకుని ఓ నిరసన కార్యక్రమం చేపడదామంటే… ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డు పుల్ల వేస్తోంది. కృష్ణా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ.. కొద్ది రోజుల కిందట.. ప్రాజెక్టుల దీక్షలను కాంగ్రెస్ తలపెట్టింది. కానీ.. ప్రాజెక్టుల వరకూ వెళ్లకుండానే.. పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేసేశారు. దాంతో నిరసన పరిగణనలోకి రాకుండా పోయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు గోదావరి దీక్షలు ప్రకటించారు.
లాక్ డౌన్ నిబంధనల పేరుతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో పోలీసులు అడ్డుకోలేరన్న భావనతో జూన్ 13న గోదావరి ప్రాజెక్టుల వద్ద జలదీక్షలకు కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారు. అందుకోసం ప్రాజెక్టులవారిగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క దీక్ష చేస్తారు. దుమ్ముగూడెం, అలిసాగర్ ప్రాజెక్టు, ప్రాణహిత, తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల వద్ద ఇతర కాంగ్రెస్ నేతలు దీక్షలకు కూర్చుంటారు.
అధికార పార్టీపై పోరాటంలో ముందుండాలని.. ఇప్పుడు పీసీసీ రేస్‌లో ఉన్న వారు తంటాలు పడుతున్నారు. పలుమార్లు.. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా స్కోర్ చేస్తున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ వివాదాన్ని తెరపైకి తీసుకు రావడంతో.. ఆయన ఎక్కువ హాట్ టాపిక్ అయ్యారు. ఈ నేపధ్యంలో జల దీక్షలను సక్సెస్ చేసి.. తామూ తక్కువ కాదని.. ఇతర నేతలు నిరూపించే ప్రయత్నం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రాజెక్టుల వద్దకు కాంగ్రెస్ నేతలు వెళ్తే కసురుకుంటున్న టీఆర్ఎస్.. వారిని ఈ సారి అక్కడి వరకూ వెళ్లనిస్తుందా.. అన్నది డౌటే..!