ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలకు ఓ అలవాటు ఉంది. అదేమిటంటే… కేంద్రం ఇచ్చే నిధులే కాదు.. వేల కోట్లు చంద్రబాబు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఏం చేశారో లెక్కలు చెప్పాలంటూ… ప్రకటనలు ఇచ్చేస్తూంటారు. అప్పుల పాలు చేసి.. ఆ మొత్తాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని.. అసువుగా చెప్పేస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే… కేంద్రం … ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేసింది. నరేంద్ర మోడీ హయాంలోగత నాలుగున్నరేళ్లకాలంలో ప్రభుత్వ అప్పు ఏకంగా 49 శాతం పెరిగింది. ఇది అక్షరాల రూ. 82 లక్షల కోట్లకు చేరింది. ఈ అప్పు మోడీ బాధ్యతలు చేపట్టే నాటికి రూ.55 లక్షల కోట్లు మాత్రమే.
ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో.. ఏ బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం జరుపుకుని..మోడీ వచ్చిన తర్వాత ఫనిషింగ్ టచ్‌లు ఇచ్చిన రెండు, మూడు వంతెనలను మాత్రం..మోడీ ప్రారంభించి.. మీడియాకు స్టిల్స్ ఇచ్చారు. కానీ.. మోడీ హయాంలో నిర్మాణం ప్రారంభించి.. పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క వల్లభాయ్ పటేల్ విగ్రహాం మాత్రం ఉంది. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసిన అప్పును.. నాలుగేళ్లలోనే చేసిన మోడీ.. ఆ సొమ్మంతా ఎక్కడ పెట్టారు..? దేనికి ఖర్చు పెట్టారు…? బీజేపీ నేతలు లెక్కలు చెబుతారా..?
ఇంకా విశేషం ఏమిటంటే… తాము ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్న పన్నులతో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అప్పులను తీరుస్తున్నామని.. ఆర్భాటపు ప్రకటనలను.. మోడీ నుంచి… కన్నా వరకూ చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన లెక్కలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. అప్పు తీర్చింది లేకపోతే.. మరో 40 లక్షల కోట్లకుపైగా కొత్తగా అప్పు చేశారు. ఏపీ చేసిన అప్పును.. బూతద్దంలో చూపిస్తూ… బీజేపీ నేతలు విమర్శలు చేస్తూంటారు. ఇప్పుడు కేంద్రం అప్పు బూతద్దంలో చూడాల్సిన పని లేదు. మామూలుగానే భారీగా కనిపిస్తున్నాయి. మరి ఏం చేశారో చెబుతారా..?