అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే.. ఒక్క ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో… మాత్రమే ఆ పార్టీ వెనుకబడింది. ఈ రెండు చోట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బకొట్టాలని గట్టిగానే ప్లాన్ చేశారు. దానికి కాంగ్రెస్ నేతల బలహీనతలు సులువుగా తోడయ్యాయి. ఖమ్మం జిల్లా నుంచి వెల్లువలా వచ్చి న చేరికలతో.. ఇప్పుడు అక్కడ మరో పార్టీ ఉందా.. అన్న అనుమానం రాక మనదు. కొత్త గూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలతో కలిపి గులాబీ ఎమ్మెల్యేలు 100కి చేరుకున్నారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కులతో మొదలైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల సంఖ్య వనమాతో 8కి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు.
దీంతో మొత్తం 99 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టయింది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నేడో, రేపో తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా… కాంగ్రెస్ డీలా పడింది. లోక్‌సభకు పోటీ చేయడానికి అభ్యర్థులు లేని పరిస్థితి తలెత్తింది. అగ్రనేతలను బరిలోకి దింపాలని… రాహుల్ చేస్తున్న ప్రయత్నాలపై.. అగ్రనేతలుగా కిరీటాలు పెట్టుకున్న వారే అడ్డుకుంటున్నారు.
ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉండేందుకు సిద్ధపడటం లేదు. ఈ పరిణామాలకు తోడు.. కేసీఆర్ ఆకర్ష్ ప్రయోగం… పకాంగ్రెస్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేద్దామన్నా…. వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరికి ఓటేసినా.. వారు చేరేది టీఆర్ఎస్లోనే అన్న భావన ప్రజలకు కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అందుకే టీఆర్ఎస్కే ఓటు వేస్తే పోలా అన్న పద్దతిలో పోలింగ్ ఏకపక్షంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.