తెలుగుదేశం పార్టీ అధినేత కంచుకోట కుప్పం. ఆయన నామినేషన్ వేయడానికి కూడా వెళ్లరు. కానీ అక్కడి ప్రజలకు కావాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం రాజీపడరు. అందుకే అక్కడ ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. చంద్రబాబు నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ సారి కూడా ఆయన కుప్పం వెళ్లడం లేదు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు. ఎన్నికల అధికారి ముందు చేయాల్సిన ప్రమాణాన్ని బుధవారం విజయవాడలో మేజిస్ట్రేట్ ముందు చేశారు.
ఆస్పత్రిలో చంద్రబాబు ప్రత్యర్థి..!
జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల హడావడి లేదు. చంద్రబాబు అభ్యర్థి కావడం ఓ కారణం అయితే.. వైసీపీ అభ్యర్థి అనారోగ్యంతో గత పది రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటం మరో కారణం. ఇప్పటికీ ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. చంద్రబాబు మూడు, నాలుగు ఎన్నికల్లో ఎప్పుడూ ఆయన ఇక్కడికొచ్చి ప్రచారంలో పాల్గొనలేదు. చంద్రబాబు తరఫున ప్రచారం మొత్తాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులే నడిపిస్తుంటాయి. విరాళాలు తీసుకుని డిపాజిట్ కడుతూంటారు. ఈ సారి కూడా అదే జరుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రే అభ్యర్థి కావడంతో కుప్పంలో ఎన్నడూ టీడీపీకి గెలుపు సమస్య ఏర్పడలేదు. 2014 ఎన్నికల్లో 45 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అయితే 2009 ఎన్నికల్లో సాధించిన మెజారిటీకి ఇది సుమారు 25 వేల ఓట్లు తక్కువ. ఎలాగైనా ఈసారి లక్ష మెజారిటీ లేదంటే 2009 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ సాధించాలన్న లక్ష్యాన్ని అధిష్టానం స్థానిక పార్టీ శ్రేణులకు విధించింది. రెండుమూడు నెలలనుంచీ పార్టీ శ్రేణులన్నీ మెజారిటీ ఎలా పెంచుకోవాలన్న వ్యూహ రచనలో మునిగితేలాయి. గతంలో చంద్రబాబుపై మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సుబ్రహ్మణ్యం రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరారు. ప్రతి మండలంలోనూ టీడీపీకి గట్టి క్యాడర్ ఉండటంతో.. వారే స్వచ్చందంగా ప్రచారం చేస్తున్నారు.
సామాజిక కోణంలో చంద్రబాబు మెజార్టీ తగ్గించే ప్రయత్నం..!
కులం బలంతో… చంద్రబాబు మెజార్టీ తగ్గించాలనేది వైసీపీ వ్యూహం. అందుకే వైసీపీ నేత జగన్.. కుప్పంలో అత్యధికంగా ఉండే సామాజికవర్గానికి చెందిన మాజీ ఉన్నతాధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టారు. ఆయన కుప్పంకు చెందిన వ్యక్తి కాదు. కానీ.. గత ఎన్నికల్లో గ్రామ పర్యటనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. తనతో కలిసివచ్చిన అనుచరణ గణాన్ని కూడేసుకుని ప్రచారాన్ని ముందుకు నడిపించారు. స్థానికులు కాకపోయినా, గత ఎన్నికల్లో సైతం ఆయనే అభ్యర్థి కావడంతో ఆ అనుభవంతో పరిచయాలను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే హఠాత్తుగా వచ్చిన గొంతు నొప్పితో అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. దీంతో కుప్పంలో వైసీపీ నేతలు సైలెంటయిపోయారు. వాట్సాప్ ద్వారా త్వరలోనే తిరిగి వస్తానని వీడియో సందేశాలు పంపుతున్నారు. క్యాడర్‌ను గట్టిగా పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కుప్పంలో కనిపించని రాజకీయ హడావుడి..!
కుటుంబసభ్యులు కాస్త ప్రచారం చేస్తున్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. అసలు అభ్యర్థి లేకపోవడంతో అంతా లైట్ తీసుకుంటున్నారు. నామినేషన్ లోపు ఆయన వచ్చి మళ్లీ ప్రచారం చేస్తే వైసీపీలో ఊపు వస్తుంది. లేకపోతే.. టీడీపీ లక్ష్యానికి వారే సహకరించినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అటు టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఎలాగూ ప్రచారానికి రారు. అనారోగ్యంతో ఉన్న వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి ఎంత సీరియస్‌గా ఉంటారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌బాబు మాత్రం నామినేషన్ వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొద్దిపాటి అనుచరగణాన్ని వెంటేసుకుని గ్రామాలు తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్ఎస్.తులసీనాథ్ అసలింకా ప్రచారమే ప్రారంభించలేదు. కుప్పంలో వచ్చే మెజార్టీనే… చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి విజయాన్ని టీడీపీ ఖాతాలో వేస్తోంది. అందుకే ఈ సారి కూడా కుప్పంలో మెజార్టీ పెంచుకోవాలని టీడీపీ భావిస్తోంది.