పవన్ కల్యాణ్ అంటే.. మ్యాన్ ఆఫ్ డిఫరెన్స్..! సినీ పరిశ్రమలో … ఆ ప్రత్యేకతే ఆయనను సూపర్ స్టార్‌ని చేసింది. తొలి సినిమా తర్వాత అసలు యాక్టర్ మెటీరియల్ కాదని విమర్శలు గుప్పించిన వారితోనే… “శభాష్ పవన్” అనిపించుకున్న విజయం ఆయనది. అలాంటి పవన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఓటములకు కుంగిపోని తత్వం.. ఎవరేమనుకున్నా.. తాను అనుకున్నది చేసే పట్టుదల ఉన్న పవన్.. రాజకీయాల్లోనూ అదే పట్టుదల చూపిస్తారా ? అదే ప్రత్యేకత చూపించాడనికి సిద్ధమవుతారా..? దీని కోసం పవన్ ఏం చేయాల్సి ఉంది..?
మార్పుని పవన్ ఆచరించి చూపించబోతున్నారా..?
సామాజిక పరంగా పవన్ కల్యాణ్ భావాలు అత్యున్నతం. సమాజంలో కుళ్లుని కడిగి పారేయాలని.. కుల, మత, ప్రాంతం అనే తేడాలను రూపు మాపేయాలనేది.. పవన్ కల్యాణ్ లక్ష్యం. తన ఆలోచనలు, సమాజాన్ని మార్చాలన్న సంకల్పంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు కూడా. నేటి రాజకీయ నేతలు ఏది చేయడానికి భయపడిపోతారో.. పవన్ కల్యాణ్ అవన్నీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో పారదర్శకత, నిజాయితీ, కుల రహిత రాజకీయాలు లాంటివన్నింటినీ ఆయన సాధించాలనుకుంటున్నారు. నేటి రాజకీయ నేతలెవరికీ.. ఈ లక్షణాలులేవని.. పవన్ కల్యాణ్ విమర్శిస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఆ నేతల జాబితాలో చేరకుండా.. రాజకీయాల్లో కూడా తాను “మ్యాన్ ఆఫ్ డిఫరెన్స్” అని నిరూపించుకోవాలంటే… కచ్చితంగా.. పారదర్శకత, నిజాయితీ, కుల రహిత రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. అయితే.. మాటల్లోకాదు..! చేతల్లో ఎలా ?
ఆదాయం, ఆస్తుల్ని ప్రకటించి పారదర్శకత పాటిస్తారా..?
రాజకీయాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. పవన్ కల్యాణ్ ప్రజా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు కాబట్టి.. ముందుగా.. తన గురించి ప్రజలకు పూర్తిగా తెలియజెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేసే ముందే తన ఆర్థిక స్థితిగతులన్నింటినీ ప్రజల ముందు ఉంచాలి. తను కడుతున్న ఆదాయ పన్ను వివరాల్ని , వున్న ఆస్తుల్ని రెండిటిని వెల్లడించాలి. ఆ తర్వాత ప్రతీ ఏడాది తన ఆస్తుల్ని,ఆదాయ పన్ను వివరాల్ని వెల్లడిస్తూ ఉంటే.. ఎలాంటి అక్రమ సంపాదన లేదని తేలిపోతుంది.తనకు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వివరాలన్నింటినీ.. బహిర్గతం చేయడం ద్వారా..ఇతర నేతలపై వత్తిడి పెంచి వారినీ తన దారిలోకి తీసుకు రావడానికి అవకాశం ఉంది. మన దేశంలో ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటిస్తారు గాని , ఆదాయపు పన్ను బహిరంగం చెయ్యరు. పాశ్చాత్య దేశాల్లో రాజకీయ నేతలు.. తమ ఆదాయపు పన్ను రిటర్నుల్ని కూడా బహిర్గతం చేస్తారు.అందుకే అమెరికా లాంటి దేశాల్లో రాజకీయాలు..పారదర్శకంగా ఉంటాయి.అలాంటి వ్యవస్థకు పవన్ ఆద్యుడయ్యే అవకాశం ఉంది.
కులరహిత రాజకీయానికి తొలి అడుగు వేస్తారా..?
కుల, మత, ప్రాంత రాజకీయాలు అంటే పవన్ కల్యాణ్‌కు అసహ్యం.ఆయనకు కులం లేదు. మతం లేదు. కానీ రాజకీయాలంటే.. ముందుగా కులం ముద్ర వేస్తారు. పవన్ పై కూడా అదే వేసే ప్రయత్నం చేశారు. కానీ.. పవన్ కల్యాణ్ ఈ ట్రాప్‌లో పడకుండా.. ఇతర రాజకీయ పార్టీలు, నేతలకు బుద్ది చెప్పేలా.. తను రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. తన కుల ప్రభావం అస్సలు లేని చోట లేదా చాలా తక్కువ వున్న చోట పోటీ చేయాలి. పవన్ కల్యాణ్.. భావి నేత. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలవగలరు. కాబట్టి… తన సామాజికవర్గం లేని చోట పోటీ చేస్తేనే…పోటీ చేసి గెలిచి తన సత్తా చూపిస్తేనే తను అనుకున్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకి పంపించగలరు.
రాజకీయాల్లో సంస్కరణల విప్లవం కోసం మొదటి అడుగు వేస్తారా..?
పవన్ కల్యాణ్ కచ్చితంగా… ఓ విప్లవం సృష్టించగల రాజకీయ నేత. ఉండవల్లి నుంచి పెంటపాటి పుల్లారావు వరకు అనేక మంది మేధావుల ప్రశంసలు పొందిన నేత. అయితే సామాన్య ప్రజలు మాత్రం..మేధావుల్లా ఆలోచించలేరు. వారికి ఎన్ని గొప్ప మాటలు చెప్పినా… వారు చేతలనే విశ్వసిస్తారు. పవన్ కల్యాణ్.. తన ఆదర్శాలను చేతల ద్వారా… ఆచరించి… గొప్ప రాజకీయ సంస్కరణ వాదిగా నిలుస్తారని.. సామాన్యుల భావన. నేటి రాజకీయాలపై అసహ్యం పెంచుకునే అనేక మంది యువ ఓటర్లు కూడా పవన్ కల్యాణ్ వైపు ఇలాగే చూస్తున్నారు. పవన్ ఈ అంచనాలను అందుకోగలరు..అనే ఆశతో…!