అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. తనకు పోలీసులపై నమ్మకం లేదనేవారు. ఏపీ పోలీసులపై ఆయన చాలా అవమానకరంగా మాట్లాడేవారు. అయితే పోలీసులు అప్పట్లో స్వేచ్చగా విధులు నిర్వహించేవారు. తప్పు చేసిన వారు టీడీపీ అయినా కేసులు పెట్టారు. వైసీపీ అయినా వదిలి పెట్టలేదు. అంతకు మించి .. శాంతిభద్రతలు కాపాడటంలో వారికి ఫ్రీ హ్యాండ్ ఉండేది. జగన్ సీఎం అయ్యాక.. ఆయనకు పోలీసులపై నమ్మకం వచ్చింది. అయితే ప్రజలందరికీ పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా చేసేశారు.
ఇప్పుడు పోలీసులంటే జగన్కు ఎనలేని నమ్మకం.. !
ఏపీలో పోలీసు వ్యవస్థ ఒకప్పుడు తమను కించ పరిచినా.. తమపై నమ్మకం లేదని ప్రకటించిన జగన్ను ఒక్కరినే నమ్ముతోంది. జగన్ కూడా పోలీసు వ్యవస్థపై తాను గతంలో ఎంత తీవ్రంగా అపనమ్మకంగా వ్యవహరించారో అంత కంటే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ జగన్ను మాత్రమే నమ్ముతోంది. జగన్ కూడా అంతే నమ్మకంగా ఉన్నారు. పరస్పర నమ్మకంగా ఉన్నారు కానీ.. వారు రాజ్యాంగాన్ని.. చట్టాలను.. ప్రజలను మాత్రం నమ్మడం లేదు. పరిగణనలోకి తీసుకోడం లేదు. జగన్ ఏది చెబితే పోలీసులు అది చేస్తున్నారు. పోలీసులు ఏం చేసినా జగన్ నమ్ముతున్నారు.
పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు !
పోలీసులంటే ప్రజలకు ఓ భరోసా ఉండాలి. కానీ ఇప్పుడు పోలీసులు అంటే వైసీపీ ప్రైవేటు సైన్యం అనే పరిస్థితి వచ్చింది. టీడీపీ నేతలు.. సానుభూతిపరులపై దాడులు చేసి.. మీసాలు మెలేసి.. దాడులు చేసి.. తొడలు కొడితే చాలు… అనుకుంటున్నారు. సామాన్య ప్రజల్ని వేధిస్తే అదనపు అర్హతగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి అన్ని చోట్లా ఉంది. రాజకీయ ఆకాంక్షలు మాత్రమే కాదు.. పోస్టింగ్లు .. అవినీతి నుంచి రక్షణ ఇలా ప్రతి వ్యవహారంలోనూ అరాజకీయమే రాజ్యమేలుతూండటంతో ప్రజలు కూడా పోలీసు వ్యవస్థపై క్రమంగా నమ్మకం కోల్పోతున్నారు. గతంలో జగన్ చెప్పినట్లుగా ఇప్పుడు ప్రజలు ఏపీ పోలీసులంటే తమకు నమ్మకం లేదని చెప్పే పరిస్థితికి వచ్చింది. పోలీసు బాధితులు టీడీపీ అనుకుంటే పొరపాటే.. వైసీపీ వాళ్లు కూడా ఎక్కువే.
వచ్చే పార్టీలు మాత్రం ఊరుకుంటాయా ?
ఇప్పుడు పోలీసుల్ని ఇలా వాడుకోవచ్చని చూపించిన తర్వాత వచ్చే పార్టీలు మాత్రం ఊరుకుంటాయా ? ఇఫ్ యు ఆర్ బ్యాండ్.. ఆయామ్ యువర్ డాడ్ అని అనుకోకుండా ఉంటాయా ? . ఇప్పుడు చేసే దానికి డబుల్ చేయకపోతే తాము చేతకాని వాళ్లమే అనుకుంటారు. చేస్తారు. నీతి సూత్రాలు వల్లించే పరిస్థితి ఉండదు. అప్పుడు వ్యవస్థ మరింత పతనం అవుతుంది. పోలీసు వ్యవస్థ అధికారంలో ఉండే వారికి ప్రైవేటు సైన్యమవుతుంది. దాని వల్ల ఎవరికి నష్టం ?