అప్పులుంటే సిగ్గుపడతారు..! తీర్చలేకపోతే పరువుపోతుందని భయపడతారు..! ఎగ్గొట్టే ఉద్దేశం ఉంటే.. అదే అప్పు ఇచ్చినోడు.. బలహీనుడని.. ఏమీ చేయలేడని.. భావిస్తే.. ఏం చేసుకుంటావో చేస్కో అంటారు…!. ఇప్పుడు దేశంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఈ సిట్యూయేషన్ లోనే ఉన్నారు. ఈ కోవలోకి… ఇండ్ భారత్ పవర్ అనే కంపెనీల యజమాని, నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కూడా చేరారు. ఆయన కంపెనీలు బ్యాంకులకు దాదాపుగా రూ. 3వేల కోట్లు ఎగ్గొట్టాయి. ఆయన ఆస్తులన్నీ వేలం వేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన కార్పొరేట్ ఆఫీస్ కూడా వేరే వారిచేతుల్లోకి వెళ్లిపోయింది. ఆయన కంపెనీలపై దివాలా పిటిషన్లు విచారణలో ఉన్నాయి. అందుకే రఘురామకృష్ణం రాజు… “దొబ్బెయ్”.. అన్న స్టేజ్‌కి వచ్చేశారు.
వైసీపీ నుంచి నర్సాపురం లోక్‌సభకు పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు.. టీవీ9కు ఓ ఇంటర్యూ ఇచ్చారు. అందులో జర్నలిస్ట్ మురళీకృష్ణ అన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఆయన అప్పులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. రూ. 3వేల కోట్ల అప్పు సంగతేమిటని ప్రశ్నిస్తే.. అంత ఉండదన్నారు. కడతారా లేదా.. అంటే… అదేం ప్రశ్న అని గదమాయించారు. మళ్లీ రెట్టించి ప్రశ్నిస్తే.. “దొబ్బెయ్రా నీకెందుకు..” అనేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రఘురామకృష్ణంరాజుకి… ఎంపీ కావాలనేది చిరకాల కోరిక. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. జగన్‌తో తేడాలు వచ్చి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత టీడీపీ – బీజేపీ పొత్తు ఉంటుందేమో… నర్సాపురం టిక్కెట్ బీజేపీ తీసుకుంటుందని.. ఆ పార్టీలో చేరారు. నర్సాపురంను బీజేపీ తీసుకుంది కానీ.. టిక్కెట్ మాత్రం గోకరాజు గంగరాజు పట్టుకుపోయారు.
ఈ సారి టీడీపీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. టీడీపీలో చేరారు కూడా. కానీ చివరికి వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తెర వెనుక ఏదో జరిగిందని చెప్పుకున్నారు. అదే.. ఆయన అప్పులకు.. భరోసా అన్న చర్చ నడుస్తోంది. చౌకీదార్లు ఉన్నారన్న భరోసా ఉండటంతోనే.. ఆయన టీడీపీని వదిలేసి.. వైసీపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఇంత ధైర్యంగా.. అప్పులు కట్టబోనని.. చెబుతున్నారని అంటున్నారు. అన్నట్లుగా.. ఈ రఘురామకృష్ణంరాజు … కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు కూడా..!