చాలా కాలం తరవాత… సమంత ఓ ప్రేమ కథలో కనిపిస్తోంది. అదే ఖుషి. ఈ సినిమా తన కెరీర్‌కి చాలా కీలకం. ఎందుకంటే వరుసగా.. రెండు డిజాస్టర్లు (యశోద, శాకుంతలం) నెత్తిమీద వేసుకొన్న సమంత.. కాస్త ఊపిరి తీసుకోవాలంటే ఓ హిట్టు పడక తప్పదు. అయితే.. సమంత ఈ పరిస్థితుల్లో లవ్ స్టోరీలో మెప్పిస్తుందా? లేదా? అనేది చాలామందిలో ఉన్న సందేహం. ప్రేమ కథల్లో ఎప్పుడూ కథానాయికదే కీలక పాత్ర. ఆమె పాత్ర చిత్రణ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోవాలి. అలాంటి సినిమాలే ఆడాయి కూడా. ఏం మాయ చేశావేలో జెస్సీని గుర్తు తెచ్చుకోండి. ఆమె తెరపై కనిపిస్తే చాలు… యువతరం హృదయాలు పులకించిపోయాయి. లవ్ స్టోరీల్లో కనిపించాల్సిన మేజిక్ అదే. మరి అది ఖుషీలో రిపీట్ అవుతుందా? సమంతని లవ్ స్టోరీల్లో ఇప్పుడు చూడగలమా?
ఎందుకంటే ఈమధ్య సమంతకు వచ్చిన ఇమేజ్ వేరు. ఫ్యామిలీమెన్, యశోద చూశాక.. మళ్లీ సమంతని లవ్ స్టోరీల్లో ఊహించుకోవడం కష్టమే. సమంత ఈమధ్య యాక్షన్ ఇమేజ్ వైపు టర్న్ తీసుకొంది. లేడీ ఓరియెంటెడ్ పాత్రల వైపు దృష్టి పెడుతోంది. ఇలాంటి దశలో ఓ లవ్ స్టోరీని ఒప్పుకోవడమే సాహసం. కానీ.. ఆ సాహసం సమంత చేసింది. తెరపై విజయ్ దేవరకొండ – సమంత ల కెమిస్ట్రీ ఎంత బాగుంటే.. ఖుషి అంత బాగుంటుంది. ఖుషి సినిమాలోంచి మొదటి పాట ఇటీవలే విడుదలైంది. ఈ పాట బాగుంది. కానీ కొన్ని నెగిటీవ్ కామెంట్లు మొదలయ్యాయి. విజయ్ – సమంతల జోడీ అంతగా కుదర్లేదని, సమంత అక్కలా ఉందని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓ పాట చూసే…. జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే…సమంతకు ఈ సినిమా పెద్ద ఛాలెంజ్. తను లవ్ స్టోరీలూ చేయగలనని ఇప్పుడు నిరూపించుకోవాలి. యువ హీరోలతోనూ జోడీ కట్టగలననే సంకేతాలు పంపాలి. అప్పుడు సమంతని వెదుక్కొంటూ కొత్త కథలొస్తాయి. మరి ఈ ఛాలెంజ్‌ని సమంత ఎంత వరకూ స్వీకరిస్తుందో చూడాలి.