తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట బల ప్రదర్శనకు ప్రయత్నించారు. ఎయిర్‌పోర్టు దగ్గరే హంగామా సృష్టించారు. గాంధీ భవన్లో ఉన్న హడావుడి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ కాంగ్రెస్‌లో ఏం జరగాలన్నా.. ఇక మాణిగం ఠాగూర్ ఆశీస్సులు ఉండాల్సిందే. ఆయన నివేదికల ఆధారంగానే.. అన్నీ జరుగుతాయి కాబట్టి.. నేతలంతా.. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కట్టారు. ఠాగూర్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి.. జనం మధ్యనే ఉండాలని అందరికీ ఓ సలహా కూడా ఇచ్చారు.
కుంతియా ఉన్నప్పుడు.. పార్టీ నేతలందర్నీ ఏక తాటిపైకి ఉంచలేకపోయారు. ఆయన హయాంలో టీ కాంగ్రెస్‌లో జరిగిన కీలకమైన డెలవప్మెంట్ రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే. కానీ.. అది పెద్దగా ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితం సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గ్రూపులు ఏర్పడ్డాయి. టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం.. బహిరంగంగానే కుమ్ములాటలు జరుగుతున్నాయి. దీంతో టీ పీసీసీ చీఫ్‌ని కూడా హైకమాండ్ ప్రకటించలేకపోయింది.
ఇప్పుడు రాగూర్.. ఈ పరిస్థితులన్నింటినీ చక్క దిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందర్నీ తన రాజకీయంతో సమన్వయం చేసుకుని.. కనీసం పార్టీకి నష్టం కలిగేలా కాకుండా.. అంతర్గతంగా సమస్యలను లేవనెత్తేలా.. పార్టీ నేతలను ఒప్పించగలిగితే.. ఠాగూర్ సగం సక్సెస్ అయినట్లే. సమర్థుడైన సారధిని గుర్తించి.. అందరితో ఆమోదముద్ర వేయించడం కూడా ఠాగూర్‌కు కీలకమే. అలా అయితే ఆయన పని సులువు అవుతుంది. లేకపోతే.. కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీలు తీర్చడానికే సమయం సరిపోతుంది. ఇక బలోపేతం మీద దృష్టి పెట్టలేరు.