వైసీపీ పాలనపై జేపీ నడ్డా చేసిన విమర్శల తర్వాత.. చాలా మంది వైసీపీ నేతల బూతులు వినలేక చెవులు మూసుకోవాలేమో అనుకున్నారు. కానీ వారికి తెలియనిదేమిటంటే… జేపీనడ్డా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు. వారికి కోపం వస్తే .. తమ పరిస్థితి ఏమిటో తెలుసు కాబట్టి… జేపీ నడ్డా… అన్ని విమర్శలు చేసినా.. ఏదో మీ అభిమానం సర్ అని అనుకోవడం తప్ప నోరు మెదపరు. మెడలు వంచేసే నేత ఆధ్వర్యంలో పార్టీ తీరు మొదటి నుంచి ఇంతే.
వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై విరుచుకుపడతారు. ముఖ్యంంగా బయట నుంచి వచ్చిన నేతలు విమర్శిస్తే అసలు ఊరుకోరు. ఎవరైనా వచ్చి ప్రతిపక్షాన్ని పొగిడినా ఊరుకోరని ఇటీవల రజనీకాంత్ ఉదంతంతో తేలిపోయింది. రజనీకాంత్ ను ఎన్ని మాటలనాలో అన్నీ అన్నారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు ఇతరులు చేస్తే.. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే తమకు మాత్రమే సాధ్యమైన భాషలో హోరెత్తించి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జేపీ నడ్డా విమర్శలకు పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు.
బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ నేతలు వచ్చి విమర్శించినా నవ్వుతూ భరించాలి కానీ.. విమర్శలు చేసే పరిస్థితి లేదు. వైసీపీ స్టైల్లో అసలు విమర్శలు చేసే అవకాశం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నోరు జారితే.. ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అందులో సందేహం లేదు. అందుకే రజనీకాంత్ ను విమర్శించినట్లుగా జేపీ నడ్డాను విమర్శించలేరు. కేంద్రంలో ఉన్న పార్టీ పట్ల కనీస భయభక్తులు పాటించాల్సిన అవసరాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకంటున్నారు. అంటే.. అందితే జుట్టు అందకపోతే బూతులు అందుకోవడం వైసీపీ విధానమన్నమాట.