విశాఖలో శ్రీకాంత్ అనే యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడి భార్య.. ఇతర పని వాళ్లు నిందితులయ్యారు. నూతన్ నాయుడిపై మాత్రం.. కేసు నమోదు కాలేదు. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య రగడ జరుగుతోంది. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే.. ఆయనను అరెస్ట్ చేయలేదా.. అని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. మరో వైపు… ఈ ఘటన వెలుగు చూసిన రోజున నూతన్ నాయుడు… శ్రీకాంత్ సెల్ ఫోన్ దొంగతన చేశాడని.. దానికి ప్రాయశ్చితంగానే… బార్బర్‌ని ఇంటికి పిలిపించుకుని స్వయంగా గుండు గీకించుకున్నారన్న ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. నూతన్ నాయుడు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సులువుగానే అర్థమైపోతుంది.
సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తరవాత… శ్రీకాంత్‌కు శిరోముండనం చేయిస్తున్న సమయంలో… ఓ వ్యక్తి వీడియో కాల్ చేశారు. ఆ కాల్లో శిరోముండనం చేయించడాన్ని చూపించారు. ప్రస్తుతం.. ఆ కాల్ ఎవరికి చేశారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సహజంగా ఇంటి పెద్దకే చేస్తారు కాబట్టి… నూతన్ నాయుడికే ఆ కాల్ వెళ్లి ఉంటుందని గుర్తించడం పెద్ద విషయం కాదు. నూతన్ నాయుడి ఆదేశాలు లేకుండా.. పని వాళ్లందరూ.. అంత దారుణమైన పని చేసే అవకాశం ఉండదు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు.. పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. ఈ విషయంలో నూతన్ నాయుడును తప్ప.. అందర్నీ నిందితులుగా చేశారు.
శిరోముండనం చేస్తున్న సమయంలో చేసిన వీడియో కాల్ నూతన్ నాయుడికేనని తెలిస్తే.. ఆయనపైనా కేసు నమోదయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ వీడియో కాల్ ఎవరికో తెలుసుకోడం క్షణాల్లో పని అని.. కానీ నూతన్ నాయుడిని కాపాడే దిశగానే.. ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ.. సామాన్యుల్లోనూ.. విపక్షాల్లోనూ వస్తోంది.