అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభించగానే.. సీఐడీ అధికారులు అసైన్డ్ ల్యాండ్స్ కేసులో అంటూ ఐదుగుర్ని అరెస్ట్ చేసి.. మళ్లీ నారాయణ..బినామీలు అంటూ పాత కథను మీడియాకు ఇచ్చారు. ఇలాంటి కథల కాచుకుని కూర్చునే సజ్జల అనధికారిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉండే టీవీ చానళ్లు.. అదే పనిగా ప్రచారం చేస్తాయి. కానీ వాస్తవం ఆ సాయంత్రానికే కోర్టులో తేలిపోయింది. ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన సీఐడీ.. రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచింది. అక్కడ న్యాయమూర్తి ఆ కేసును పరిశీలించి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు తలదించుకున్నారు తప్ప సమాధానం లేదు.
అసలు అమరావతి అసైన్డ్ ల్యాండ్స్‌లో అమ్మినది ఎవరు అంటే సీఐడీ అధికారులు చెప్పలేదు. కొన్నది ఎవరూ అంటే సమాధానం లేదు. అసలు ప్రభుత్వానికి ఎలా నష్టం జరిగింది అంటే సమాధానం లేదు. అసలు ఫిర్యాదు దారు బాధితుడేనా అంటే కాదు.. మరి కేసు ఎలా నమోదు చేశారు అంటే సీఐడీ అధికారులు చెప్పలేకపోయారు. అంటే.. పక్కాగా తప్పుడు కేసు పెట్టి..మీడియాలో ప్రచారం చేసి..బద్నాం చేయడానికి సీఐడీ ని టూల్‌గా వాడుకున్నారు. అన్నీ తెలిసి సీఐడీ కూడా ఉపయోగపడింది. చట్టాన్ని ఉల్లంఘించి కొంత మందిని బాధితుల్ని చేసేశారు.
కోర్టు సీఐడీ తీరును ప్రశ్నించి.. అరెస్ట్ చేసిన వారందరి రిమాండ్‌ను తిరస్కరించింది. రాజకీయ కక్షలు.. కుట్రలు.. కుతంత్రాలతో సీఐడీ అధికారులు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా వినవచ్చు కానీ .. ఎప్పటికైనా అది వారి వద్దకు తిరిగి రావడం ఖాయం. ఎందుకంటే.. రేపు అనేది అందరికీ ఉంటుంది. అది ఒక్కలాగే్ ఉండదు. ఎవరో స్వార్థం కోసం బలైపోవడానికి సీఐడీ అధికారులు సిద్ధపడుతూ ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. సీఐడీపై ఉన్న తీవ్ర అభియోగాలు … అసలు వారు చేస్తున్నది పోలీసు ఉద్యోగమేనా డౌట్ వచ్చేలా చేస్తోందంటున్నారు. కోర్టులు వ్యక్తం చేస్తున్న సందేహాలు కూడా అలాగే ఉంటున్నాయి.