మాచర్ల నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈవీఎం ధ్వంసం కేసును ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కోర్టులో ఏ-1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని పరిగణించాలని మెమో దాఖలు చేయటంతో పాటు, దాదాపు 12ఏళ్ల శిక్షపడేలా కొత్త సెక్షన్లు పెట్టారు.
అయితే, ఈ విషయంలో సీఈసీ రంగంలోకి దిగటంతో పోలీసులు వేగం పెంచారు. రెండ్రోజులుగా పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. పిన్నెల్లి అరెస్ట్ కు సీఈసీ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా స్పందించారు.
పిన్నెల్లి కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారని, ఇంకెవరూ ఇలా ఈవీఎంలను ధ్వంసం చేయాలన్న ఆలోచన చేయకుండా కేసులు నమోదు చేసి శిక్షపడేలా చేస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయటం వల్లే పిన్నెల్లికి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికాయన్నారు. అయితే, అక్కడ ఈవీఎం ధ్వంసం అయినా డేటా భద్రంగానే ఉందని, రీపోలింగ్ అవసరం లేదని ఈసీ స్పష్టతనిచ్చింది.
ఇక, పిన్నెల్లి దేశం విడిచిపోతారన్న అనుమానంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సంగారెడ్డి సమీపంలో ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లగా… పిన్నెల్లికి చెందిన వాహనాలు దొరికాయి. కానీ అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ లేరని తెలుస్తోంది.