ఏపీలో దళితులు అంటే వైసీపీకి మద్దతుగా ఉండాలి లేకపోతే నోరెత్తకుండా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తూండటం ఆ వర్గం ప్రజల్లో అసహనానికి కారణం అవుతోంది. చాలా మంది దళిత నేతలు తమ వర్గం హక్కుల కోసం ఇటీవల గొంతెత్తుతున్నారు. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన వారే. గత ఎన్నికలకు ముందు మహాసేన పేరుతో హడావుడి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాస్త గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ .. వైసీపీకి మద్దతు ప్రకటించారు. అనూహ్యంగా వైసీపీ గెలిచిన తర్వాత ఆయనపై వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన ఇంటలెక్చువల్‌గా మారిపోయారు.
ఎక్కడా వివాదాస్పద ప్రకటలు చేయకుండా ప్రభుత్వ లోపాలను బయట పెడుతున్నారు. మహాసేన మీడియా పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టి చాలా పకడ్బందీగా ప్రభుత్వ తప్పులు ఎండగడుతున్నారు. దళితులపై దాడులను ప్రశ్నిస్తున్నారు. ఇలాచేస్తూ ఉంటే కేసులు నమోదు కాకపోవడం అనేది ఉండదు. అందుకే ఆయనపై కేసులు నమోదవుతూనే ఉన్ాయి. ఇలాంటి దళిత వర్గాన్ని టార్గెట్ చేయడంలోనూ సీఐడీ ఏడీజీ సునీల్‌నే ప్రభుత్వ వర్గాలు వాడుకుంటున్నాయని మహాసేన రాజేశ్‌పై నమోదవుతున్న కేసులతో స్పష్టత వస్తోందని అంటున్నారు. మహాసేన రాజేశ్ అనుచరుడు సీఐడీ సునీల్ ను దూషించారని శ్రీకాకుళంలో కేసు నమోదు చేసి ఆయనను పిలిపించారు
ఎనిమిది గంటలకుపైగా విచారణచేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇది నోరు తెరవకుండా చేసే ప్రయత్నమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మహాసేన రాజేష్‌కు దళిత వర్గాల్లో అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. రాజేశ్‌తో పాటు వచ్చిన వారి కార్లను లాగేసుకోడం… వారి కార్లకు పత్రాలు లేనివిని చూపించి లాక్కోవడం.. వారిపై అనుమానాస్పదంగా చూడటం వంటివి చేసి దళితుల్ని అవమానించారన్న భావన వారిలో పెరిగిపోయింది. దళిత వర్గాలను బెదిరించి మద్దతుదారులుగా ఉంచుకుందామనుకుంటున్న ప్రయత్నం ప్రస్తుత పరిస్థితుల్లో వర్కవుట్ కాదని… వారు తిరగబడతారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.