పెళ్లి సందట్లో రాజకీయ దోస్తానా అంటూ గతంలో రాశాను. అందరూ అనుకుంటున్న ఈ ఈ విషయమై తర్వాత చాలా చర్చలే జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాగోష్టిలోనూ దీనిపై స్పందించారు. అయితే పెళ్లిని కూడా రాజకీయం చేస్తే ఎలాగ అని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయం చేయడం పరిటాల సునీత పెళ్లి ఆహ్వానం ఇచ్చినప్పుడే రాజకీయం మొదలైందంటున్నారు ఆంధ్రజ్యోతి అధినేత, ఆ నాటి పెళ్లికి కెసిఆర్ సహ ప్రయాణీకుడైన ఆర్కే. వివాహాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని సూటిగా రాశారు. పరిటాల రవి సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడానికి ఆ వివాహాన్ని వాడుకున్నారని, అందుకే ఆ కులానికి చెందిన మంత్రి తుమ్మలతో పాటు ఇరురాష్ట్రాల కమ్మ సంఘం అద్యక్షుడైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కూడా తీసుకెళ్లారని, హెలిపాడ్ వద్ద పయ్యావుల కేశవ్‌తో మాట్లాడినట్టు ఒక సన్నివేశం సృష్టించారని రాశారు. తనను వ్యతిరేకిస్తున్న రెడ్లకు వ్యతిరేకంగా ఈ వర్గంతో సన్నిహితంగా వుండాలని తాను భావిస్తున్నట్టు చెబుతూ ‘వెల్కమ్’గ్రూపుగా సోషల్మీడియాలోచలామణి అవుతన్న దాన్ని కెసిఆర్ ఆమోదపూర్వకంగా ప్రస్తావించినట్టు ఆర్కే కుండబద్దలుకొట్టి చెప్పేశారు.ఈ చెప్పడం కూడా ఉద్దేశపూర్వకమే అయివుండొచ్చు. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అనుసరించిన పాత వ్యూహమే నంటూ తన కొత్తపలుకు శీర్షిక కూడా అదే పెట్టారు. సో.. పెళ్లిలో కుల రాజకీయాలకు ఘనమైన సాక్ష్యం లభించినట్టే కదా! తన కాలమ్‌లో సింగరేణి ఎన్నికల విజయానికి కెసిఆర్‌ను ప్రశంసించిన ఆర్కే తర్వాత జరిగిన మీడియా గోష్టిలో మాట్లాడిన తీరును ప్రస్తావించకపోవడం విశేషం.