ఫామ్‌హౌస్‌లో రూ. 15 కోట్లు దొరికినట్లుగా ప్రచారం జరిగింది. ఓ కారులో బాగా కుక్కినట్లుగా ఉన్న కొన్ని బ్యాగుల్ని పోలీసులు మీడియాకు చూపించారు. రూ. వంద కోట్ల దగ్గర్నుంచి ప్రారంభించి రూ. 15 కోట్లకు లెక్క దిగినా.. అది చిన్న మొత్తం కాదు. ఈ డబ్బుల గురించి పోలీసులు.. కోర్టులో చెబుతారని అనుకున్నారు. కానీ చెప్పలేదు. అసలు డబ్బులు రికవరీ చేసినట్లుగా కూడా చెప్పలేదు. దీంతో కేసు తేలిపోయినట్లయింది. లీక్ చేసిన ఆడియోలతో కేసు ఎంత వరకు నిలబడుతుందో చెప్పలేరు .. ప్రజల్లో రచ్చ చేయడానికి బాగానే ఉంటుంది.
అయితే అసలు డబ్బులెందుకు రికవరీ చూపించలేదనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. ఈడీ అని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుటున్నాయి. రూ. పదిహేను కోట్ల రికవరీ చూపించినట్లయితే.. ఈ పాటికి.. ఐటీ, ఈడీలు రంగంలోకి దిగేవని .. అప్పుడు కేసు పూర్తిగా మారిపోయేదని… కేసీఆర్ మెడకే రివర్స్‌లో చుట్టుకునేదని అందుకే వ్యూహాత్మకంగా డబ్బు రికవరీ చూపించలేదంటున్నారు. ఈడీ అడుగు పెడితే కేసు ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం. ముందుగా నలుగురు ఎమ్మెల్యేలు నిందితులు అవుతారు. అంతకు మించి కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వెళ్లిపోతుంది. అందుకే డబ్బు రికవరీ చూపలేదంటున్నారు.
రాజకీయ అవినీతి విషయంలో ఈడీ లెక్కలు తేల్చాలనుకుంటే పెద్దగా సమయం పట్టదు. కానీ పొలిటికల్ స్కోర్స్ కోసమే ఈడీ ఎంత వరకూ దర్యాప్తు చేయాలో అంత వరకూ దర్యాప్తు చేయడం వల్ల చాలా మంది సైలెంట్‌గా ఉంటున్నారు. ఇప్పుడున్న సాంకేతిక ప్రపంచంలో కోట్లు డబ్బులు పట్టుబడితే వాటి మీద ఉన్న సీరియల్ నెంబర్ల ఆధారంగా.. ఎక్కడెక్కడ సర్క్యూలేట్ అయ్యాయో సులువుగా తెలుసిపోతుంది. అలా చేయాలంటే.. టార్గెట్ చేయాలి… అలా టార్గెట్ కాకుండా ఉండటానికే.. డబ్బు రికవరీ చూపింలేదని … దర్యాప్తు కేంద్ర సంస్థల దగ్గరకు వెళ్లకుండా చూసుకున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.