న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను దూషించిన కేసు హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేస్తోంది. వ్యవస్థీకృతంగా నేరం ఎవరు చేశారో మాత్రం కనిపెట్టడానికి ప్రయత్నించడం లేదు. అవుతు శ్రీధర్ రెడ్డి అనే బూతు పంచాంగం వినిపించే వ్యక్తితో పాటు మరో ఐదుగుర్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. గతంలో ఓ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికి పదకొండు మందిని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్లని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు. అవి ఎప్పటికి తేలుతాయో తెలియదు.
కానీ న్యాయవ్యవస్థపై వీరంతా ఎవరికి వారు పోస్టులు పెట్టలేదు. అంతా వ్యవస్థీకృతంగా జరిగింది. ఓ పద్దతి ప్రకారం న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికి న్యాయమూర్తుల్ని బెదిరించడానికి చేసిన పని అది. అది ఎక్కడ నుంచి జరిగిందనేది సీబీఐ తేల్చాల్సి ఉంది. నిజానికి సీబీఐకి కూడా ఈ విషయంపై స్పష్టత ఉంది. ఇది వ్యవస్థీకృతంగా జరిగిన దాడి అని.. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని గతంలోనే సీబీఐ ప్రకటించిది. అయినా దేశంలోని ఓ అత్యున్నత వ్యవస్థపై జరిగిన దాడి విషయంలో సీబీఐ అంత చురుగ్గా ఉండటం లేదు.
ఓ ఎంపీ నేరుగా వైసీపీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి … న్యాయమూర్తుల కాల్ డేటా చెక్ చేయాలని ఆరోపించారు. ఆ తర్వాత కొంత మంది నేతలూ అదే ప్రకటనలు చేశారు. వారెవరినీ సీబీఐ ఇంత వరకూ ప్రశ్నించలేదు. న్యాయవ్యవస్థపై దాడి చేసిన అందరికీ అండగా ఉంటామని విజయసాయిరెడ్డి లాంటి నేతలు ప్రకటించారు. వారినీ పట్టించుకోలేదు. వాయిదా ఉన్నప్పుడల్లా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఉండటంతో సూత్రధారులు బయటకు రారేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది.