నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ సుధాకర్ వద్దకు వెళ్లి వాంగ్మూలం సేకరించించారు. గతంలో… న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలం విషయాలు మొత్తం..మరోసారి సీబీఐ ఎస్పీకి సుధాకర్ వివరించినట్లుగా తెలుస్తోంది. తనతో పోలీసులు, అధికారులు ఎలా వ్యవహరించారో సుధాకర్ చెప్పగలిగారు కానీ..వారి పేర్లేమిటో తెలియకపోవడంతో.. గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల పేరు మీద కేసు నమోదు చేశారు.
నేరపూరత కుట్ర, ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడం , మూడ్రోజులు అంతకుమించి నిర్బంధించడం, చోరీ వంటి సెక్షన్లు సీబీఐ నమోదు చేసిన కేసులో ఉన్నాయి. తనను కొట్టారని.. తన కారులోని రూ. పది లక్షలు .. ఒక బుల్లెట్, కారు తాళాలు, ఏటీఎం కార్డులు ఉన్న పర్సు కూడా దొంగిలించినట్లు సుధాకర్ సీబీఐ ఎస్పీకి చెప్పారు. డాక్టర్ సుధాకర్ విషయంలో.. పోలీసులు, ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్న విమర్శలు రావడం…పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించడంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది
హైకోర్టులో జరిగిన విచారణలో…సుధాకర్ .. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారా.. పోలీస్ కస్టడీలో ఉన్నారో కూడా… ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పలేకపోయారు. సుధాకర్ విషయంలో… అనేక రకాల నిబంధనల ఉల్లంఘనలు కళ్ల ముందు కనిపిస్తూండటంతో.. ఈ కేసు వ్యవహారంలో ఉన్న పోలీసులు, సుధాకర్‌కు మానసిక వ్యాధి ఉందని.. నివేదిక ఇచ్చిన వైద్యులకు చిక్కులు తప్పవని అంచనా వేస్తున్నారు.