ఫామ్ హౌస్ కేసులో సీబీఐ అధికారులు కేసును ఢిల్లీలోనే నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేయాలంటే .. ఆయా రాష్ట్రాల్లోనే నమోదు చేస్తారు. కానీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ ఢిల్లీలో కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణలో సీబీఐకి ప్రభుత్వం జనరల్ కన్సెంట్ రద్దు చేయడమే.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ విచారణ జరిపితే జనరల్ కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఒక్కటే. కానీ ప్రాథమికంగా అనుమతి మాత్రం ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అప్పీల్ చేసుకున్నందున ఆ తీర్పు వచ్చే వరకూ అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. సీబీఐ లేఖ రాసినా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఢిల్లీలో కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కేసు నమోదు చేసినా హైదరాబాద్ కేంద్రంగా విచారణ చేయనున్నారు.
ఈ కేసును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే విచారణ ప్రారంభమైతే.. చాలా సీరియస్ గా సాగుతుందని అంటున్నారు. హైదరాబాద్ సీబీఐ అధికారులు కాకుండా ఢిల్లీ స్థాయి సీబీఐ అధికారులు విచారణ జరుపుతారని అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. అక్కడ తీర్పు వచ్చిన తర్వాత సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉంది.