వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ చేయడానికి సీబీఐకి కనీస సహకారం కూడా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రికార్డులన్నీ అధికారులు సీబీఐకు ఇవ్వలేదు. రికార్డుల కోసం సీబీఐ అధికారులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలమవడంతో చివరికి వారు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అధికారులు ఇవ్వకపోయినా కోర్టులో ఉన్న రికార్డుల అధారంగా అయినా దర్యాప్తు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు .. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను సీబీఐ కోరింది.
అయితే తమకు ఆదేశాలు లేవన్న కారణం చెప్పిన పులివెందు మెజిస్ట్రేట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రికార్డులన్నీ తమకు అప్పగించేలా కింది కోర్టును ఆదేశించాలంటూ.. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు దీనిపై విచారణ ప్రారంభించింది. ఇప్పటికి రెండు విడతలుగా ఓ బృందం వివేకా హత్య కేసును దర్యాప్తు చేసింది. అయితే ఆ బృందంలో కొంత మందికి కరోనా రావడంతో కొత్త బృందానికి బాధ్యత అప్పగించింది. కొత్త బృందం.. ఢిల్లీలో కేసు నమోదు చేసింది.
ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. తొలుత వివేకా హత్య కేసును సీఆర్పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.. అందుకే.. సీబీఐ ఐపీసీ 302 ప్రకారంగా రీ రిజిస్ట్రేషన్ చేసింది. గత ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయంగాను పెను సంచలనంగా మారింది.