సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణ కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇలా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక సీబీఐ అధికారులు తమంతట తాముగా తెలంగాణలో అడుగు పెట్టలేరు. అయితే కోర్టు ఆదేశిస్తే మాత్రం దర్యాప్తు చేయవచ్చు. ఈసీ ఆదేశించినా దర్యాప్తు చేయవచ్చో లేదో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ నేతలు ఈసీని కోరారు.
గత బీహార్ పర్యటన సందర్భంగా కేసీఆర్ బీహార్లో ఇేద ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ను రద్దు చేయాలన్నారు. అప్పట్లోనే నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆదేశాలు బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. చట్టాల ప్రకారం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే విచారణ జరుగుతుంది. ఓ రాష్ట్రంలో సొంతంగా సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించవు. వారిపై సీబీఐ .. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దాడులు చేయవచ్చు. ఇలా చేయడానికి కూడా సీబీఐకి అన్ని ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిన తరవాత విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు సీబీఐకి ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసి చాలా మందికి మార్గం చూపారు. అప్పట్లో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ ఈ నిర్ణయంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తప్పు చేయకపోతే భయమెందుకన్నట్లుగా బహిరంగసభల్లో మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్కు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన అన్ని రాష్ట్రాలూ అదే చేయాలని అంటున్నారు.